తెలుగుదేశం పార్టీ ఎవరిది అంటే నందమూరిది అనే అంటారు. అయితే అల్లుడు చంద్రబాబు చాలా తెలివిగా గుంజుకుని పాతికేళ్ళ పాటు రాజ్యం చేశారు. టీడీపీని పెట్టిన ఎన్టీయార్ పద్నాలుగేళ్ళు ప్రెసిడెంట్ గా ఉంటే బాబు మాత్రం 24 ఏళ్లుగా నాటౌట్ అంటున్నారు. ఇక ఎన్టీయార్ కేవలం ఏడున్నరేళ్ళు సీఎం గా ఉంటే బాబు మాత్రం పద్నాలుగేళ్ల పాటు ఆ సీట్లో కూర్చున్నారు. ఈ ఎపిసోడ్ ఏం చెబుతోంది... పార్టీ పెట్టిన వారి కంటే లాక్కున్న వారికే బాగుందనే కదా. మరి తాడి ఎక్కే వారికి తలదన్నే వారు ఉంటారని కూడా అంటారు.


అదే ఇపుడు జరుగుతుందేమో. బాబుకు ఎన్ని రాజకీయ వ్యూహాలు ఉన్నా వయసు పెద్ద మైనస్. ఇపుడు డెబ్బయిల్లోకి వచ్చిన బాబు మరో అయిదేళ్ళు ఇదే జోష్ తో పార్టీని లాగడం కష్టం. ఇక ఆయన గారి పుత్రరత్నం లోకేష్ అయితే టీడీపీ జోలికి వస్తే ఉనికి కూడా ఉండదన్నది క్యాడర్ ఏకాభిప్రాయం. ఈ పరిస్థితుల్లో బాబు మనసు లోకేష్ వైపు ఉంటే క్యాడర్ మాత్రం జై జూనియర్ ఎన్టీయార్ అంటున్నారు.



అదేదో ఎక్కడో కాదు, ఏకంగా బాబు సభలోనే ఆయన ముందే అంటే పెద్దాయన ముఖం వాడిపోదా. ఈ చిత్రం శ్రీకాకుళం జిల్లా పార్టీ సమీక్షా సమావేశంలో జరిగింది. ఓ పదిమంది వరకూ కార్యకర్తలు బాబు ఎదురుగానే జూనియర్ని పొగిడేసారట. అయితే వారిని ఆ తరువాత బయ‌టకు తెలివిగా పంపించినా క్యాడర్ మనసు ఏంటో బాబుకు అర్ధమైపోయి ఉండాలి. 


ఇక బయటకు వచ్చిన క్యాడర్ మీడియాతో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీయార్ వస్తేనే టీడీపీ బతికి బట్టకడుతుందని క్లారిటీగా చెప్పుకొచ్చారు. ఇపుడున్న పరిస్థితుల్లో జూనియర్ రావాలని, లేకపోతే పార్టీ మటాష్ అన్న భావన కూడా కచ్చితంగా చెప్పేయడం విశేషం, మరి బాబు తన తరువాత చినబాబు ఆ తరువాత దేవాన్ష్ బాబు అంటున్నారే. ఇది కుదిరే వ్యవహారమేనా. ఏది ఎలాగున్నా క్యాడర్ ఇవాళ‌ ఇలా అంటే కనుక  టీడీపీలో ముసలం పుట్టినట్లే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: