హైకోర్టు ఆదేశాలతో సీఎం కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం తప్ప మిగిలిన అంశాలను పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారానికి చర్యలు చేపడుతోంది. ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మకు డిమాండ్ల పరిశీలన కొరకు ఆర్టీసీ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి మూడు రోజుల్లో నివేదిక అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. 
 
నివేదిక అందిన తరువాత సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. హైకోర్టు ఉత్తర్వులు నిన్న అందడంతో మొదట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులతో సమావేశమయ్యారు. కొత్తగా ఏర్పాటైన కమిటీ పూర్తి వివరాలతో సునీల్ శర్మకు నివేదిక అందిస్తుంది. సునీల్ శర్మ ఆ నివేదికను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతారని తెలుస్తోంది. నివేదిక పరిశీలన తరువాత కార్మిక సంఘాలతో చర్చల గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 
 
సీఎం కేసీఆర్ అధికారులకు వెయ్యి అద్దె బస్సులు సమకూర్చుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిశీలించటం కొరకు ఆర్టీసీ ఈడీ టి.వెంకటేశ్వరరావు అధ్యక్షుడిగా ఈడీలు వెంకటేశ్వర్లు, యాదగరి, వినోద్ కుమార్, పురుషోత్తం, ఆర్థిక సలహాదారు రమేష్ సభ్యులుగా ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ కమిటీని ఏర్పాటు చేశారు. 
 
సీఎం కేసీఆర్ చట్టవ్యతిరేకంగా జరుగుతున్న సమ్మెకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు పలకడం అనైతికమని అన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ తమంతట తామే వదులుకున్నారని కేసీఆర్ చెప్పారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వుల్లో ఇదే విషయాన్ని ప్రస్తావించారని చెప్పారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేయటంతో ప్రభుత్వం త్వరలోనే ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: