మాజీ ఎంపి, సీనియర్ నేత జేసి దివాకర్ రెడ్డి కుటుంబానికి చుక్కలు కనబడుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి బాధ తగ్గకముందే ఆర్ధిక మూలాలు కూడా కుప్ప కూలిపోతున్నాయి. దశాబ్దాలుగా  జేసి కుటుంబం రాజకీయంగా పటిష్టంగా ఉందంటే అందుకు బలమైన ఆర్ధిక వనరులే ప్రధాన కారణం. మొదటి నుండి జేసి కుంటుంబం మైనింగ్, ట్రాన్స్ పోర్టు రంగాల్లో పాతుకుపోయుంది. ఇపుడు ఆ రెండింటి మీద దెబ్బ దెబ్బ పడుతోంది.

 

మొన్నటి ఎన్నికల్లో జేసి కుటుంబం నుండి యువతరం ఎన్నికల్లో పోటి చేసింది. అనంతపురం ఎంపిగా దివాకర్ రెడ్డి కొడుకు పవన్ రెడ్డి, తాడిపత్రి ఎంఎల్ఏగా ప్రభాకర్ రెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డి పోటి చేసి ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. మామూలుగా ఓపెన్ క్యాటగిరి నియోజకవర్గంలో ఓ అభ్యర్ధి పోటి చేయాలంటే కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిందే.

 

అలాంటిది ఒకేసారి జేసి వారసుల హోదాలో ఇద్దరు ఎంపిగా, ఎంఎల్ఏగా పోటి చేసినందుకు సుమారుగా రూ. 100 కోట్ల దాకా ఖర్చయిందని సమాచారం.  ఇద్దరూ ఓడిపోయారు కాబట్టి ఆ మేరకు వారికి నష్టం జరిగినట్లే భావించాలి. సరే ఎన్నికలన్నాక గెలుపు ఓటములు సహజమే అని సరిపెట్టుకుంటే తర్వాత జరిగిన డెవలప్మెంట్లతోనే జేసిలకు చుక్కులు కనబడుతున్నాయట.

 

మైనింగలో చాలా అక్రమాలున్నాయంటూ కొన్ని యూనిట్లను అధికారులు మూసేశారట. తాజాగా బస్సులపైన కూడా రవాణా శాఖ ఉన్నతాధికారులు దాడులు చేస్తున్నారు. ఇప్పటి వరకూ సుమారు 50 బస్సులను సీజ్ చేశారు. దొంగ పర్మిట్లతోను అసలు పర్మిట్లే లేకుండాను స్టేజ్ క్యారియర్,  కాంట్రాక్టు క్యారియర్ పద్దతిలో తిరుగుతున్న బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నట్లు గుర్తించి సీజ్ చేశారు.

 

నిబంధనలను అతిక్రమించటం జేసిలకు కొత్తేమీ కాదు. కాకపోతే దశాబ్దాలుగా అధికారపార్టీలోనే ఉండేవారు కాబట్టి ఆడింది ఆటగా సాగిపోయింది. మొదటిసారి ప్రతిపక్షంలో కూర్చోవాల్సొచ్చింది. దాంతో వాళ్ళ వ్యాపారాల్లోని అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంకెన్ని అక్రమాలు బయటపడతాయో చూడాలి.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: