జమ్మూ-కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దును జీర్ణించుకోలేకపోతున్న పాకిస్థాన్‌... ప్రతీకారేచ్చతో రగిలిపోతోంది. ఉగ్రవాదుల్ని భారత్‌లోకి పంపి విధ్వంసం సృష్టించాలని చూసినా... ఆ దారులన్నీ మూసేసింది మన సరిహద్దు భద్రతా దళం. పైగా సరిహద్దు దాటకుండానే ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర శిబిరాలను భారత్‌ ధ్వంసం చేయడం దాయాదీకి మింగుడుపడడం లేదు. 


ఉగ్రవాదుల్ని సరిహద్దు దాటించాలని పట్టుదలగా ఉన్న పాక్‌... ఇండియన్‌ ఆర్మీ పోస్టులపై గుళ్ల వర్షం కురిపిస్తోంది. దీనికి భారత్‌ దీటుగా బదులిస్తోంది. ఒకానొక సందర్భంలో నియంత్రణ రేఖ దాటి 400 మీటర్లు భారత్‌లోకి చొచ్చుకొచ్చింది పాక్‌ సైన్యం. దీంతో అప్రమత్తమైన భారత సైనికులు కాల్పులు ముమ్మరం చేయడంతో... పాక్‌ సైనికులు వెనుదిరిగారు. ఆదివారం పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో గల నీలమ్‌ లోయలోని 4 ఉగ్ర శిబిరాలను భారత్‌ ధ్వంసం చేసింది. ఇందులో 20 మంది ఉగ్రవాదులు, 10 వరకూ పాక్‌ సైనికులు మరణించారని ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ చెప్పారు. కానీ... పాకిస్థాన్‌ తమకు ఎలాంటి నష్టమూ జరగలేదని బుకాయించింది. ఈ పరిస్థితుల్లో సోమవారం విదేశీ ప్రతినిధులు, జర్నలిస్టులు అక్కడ పర్యటించారు. వీరి పర్యటనకు కొన్ని గంటల ముందు... కాల్పులు జరపొద్దని భారత్‌ను కోరింది పాకిస్థాన్‌. అయితే... కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడింది. నౌషెరా సెక్టార్లో పాక్‌ రేంజర్లు జరిపిన కాల్పుల్లో మన సైనిక అధికారి ఒకరు చనిపోయారు. అలాగే, ఇద్దరు పౌరులకు గాయాలయ్యాయి.   


మరోవైపు పంజాబ్‌ సరిహద్దులో మరో సారి కలకలం రేపాయి డ్రోన్లు. దీంతో ఫిరోజ్‌పూర్‌, హుస్సేన్‌వాలా సెక్టర్లలో భారీగా బి.ఎస్.ఎఫ్ బలగాలను మోహరించారు. నిరంతరం గస్తీ తిరుగుతున్న బి.ఎస్.ఎఫ్ ఇంత వరకూ మూడు అనుమానిత డ్రోన్లను కూల్చేసింది. సోమవారం రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో పాకిస్థాన్‌ గగన తలం నుంచి భారత్‌లోకి ఓ డ్రోన్‌ వచ్చింది. దీంతో భద్రతా దళాలతో పాటు పంజాబ్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. భారత్‌లోకి చొరబడేందుకు అనువైన మార్గం కోసం డ్రోన్లను ఉపయోగిస్తోంది పాకిస్థాన్‌. అత్యాధునిక కెమెరాలు, జీపీఎస్‌ వ్యవస్థలు గల డ్రోన్లకు భారత్‌ వైపునకు పంపి... గస్తీ లేని ప్రాంతాలను గుర్తించే ప్రయత్నం చేస్తోంది పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్‌ సర్వీస్‌ ఇంటెలిజెన్ ఐ.ఎస్.ఐ. అలాగే స్థానిక గైడ్ ల  సాయంతో చొరబాటుకు కొత్త దారులు వెదుకుతోంది.   


26/11 తరహాలో ఉగ్రవాదులు తీరం ద్వారా చొరబడి విధ్వంసం సృష్టించకుండా ఇండియన్‌ నేవీ పటిష్ట చర్యలు తీసుకుంటోందన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌. భారత్‌ ఎప్పుడూ కావాలని ఏ దేశంపైనా దాడి చేయలేదని... పరాయి భూమిని అంగుళం కూడా లాక్కోలేదన్నారు. కానీ, భారత్‌ను తప్పుడు దృష్టితో చూసే వాళ్లకు తగిన గుణపాఠం చెప్పే సామర్థ్యం మన సాయుధ బలగాలకు ఉందన్నారు. భారత నేవీ నిఘా నీడలో మన సముద్రమార్గం అత్యంత సురక్షితంగా ఉందన్నారు రాజ్‌నాథ్‌ సింగ్‌. మొత్తానికి భారత్‌-పాక్‌ సరిహద్దులో వాతావరణం ఉద్రిక్తంగా ఉంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కు మంటున్నారు సరిహద్దు గ్రామాల్లోని జనం. 


మరింత సమాచారం తెలుసుకోండి: