అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యంగాస్త్రాలు సంధించారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎంపీగా ఉన్నప్పుడూ జగన్ పై వ్యంగ్యంగా మాట్లాడిన జేసీ ఇప్పుడు జగన్ సీఎం అయ్యాక కూడా అదే తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జగన్ పరిపాలనలో కిందా మీదా పడుతున్నారని వ్యాఖ్యానించారు. దివాకర్ ట్రావెల్స్ కు చెందిన బస్సులను రవాణ శాఖ సీజ్ చేయడంతో ఆయన స్పందించారు.

 

 

'రాష్ట్రంలో ఎన్నో ప్రైవేట్ ట్రావెల్స్ ఉండగా సీఎం జగన్‌ కు మాత్రం నా బస్సులే కనిపిస్తున్నాయి. జగన్ పాలనకు 100కు 150 మార్కులు ఇవ్వాలి. జనరంజకంగా పాలన జరుగుతుంది. గతంలో ఎప్పుడూ లేనంతగా మా ట్రావెల్స్‌కు చెందిన 31 బస్సులు సీజ్ చేశారు. మూడు నెలలపాటు బస్సులు నడపకూడదని సస్పెండ్ చేశారు. మా బస్సులను సీజ్‌ చేయడంపై న్యాయపరంగా పోరాడతాం. ప్రభుత్వంలో మా మాట వినేవారు లేనప్పుడు న్యాయపోరాటం తప్పదు. కేవలం నా బస్సులనే భూతద్దంలో చూసి సీజ్ చేశారు. జరిమానాతో పోయే తప్పిదాలకు సీజ్ చేయడం ఎంతవరకు సబబు. జగన్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ మా అబ్బాయే. పరిపాలనలో జగన్.. కిందా మీద పడుతున్నారు. యువకుడు కదా! జగన్ ను చిన్నప్పటినుంచీ చూస్తున్నా' అంటూ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి స్పందించారు.

 

 

2017లో దివాకర్ ట్రావెల్స్ బస్ విజయవాడ సమీపంలో వంతెనపై నుంచి పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ చేసిన వ్యాఖ్యలకు జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర పదజాలంతో జగన్ పై విరుచుకుపడటం తెలిసిందే. ఇప్పుడు జగన్ సీఎం అయ్యాక ప్రభుత్వపరంగా దివాకర్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేయడం చర్చనీయాంశం అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: