మరికొద్ది గంటల్లో దేశంలోని రెండు కీలకమైన రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఈ ఫలితాలకూ ఓ విలువ ఉంది. దేశాన్ని మలుపు తిప్పే ఫలితలుగా వీటిని చూడాలి. కాంగ్రెస్ కి పెట్టని కోటగా  ఉన్న మహారాష్ట్ర, అలాగే ప్రతి అయిదేళ్ళకు అధికార మార్పిడి జరిగే హర్యానాలో ఈసారి ఎవరు విజేత అవుతారన్నది చాలా ఆసక్తిని కలిగిస్తోంది. ఈ ఫలితాలు కూడా భారీ రాజకీయ మార్పులకు దారితీస్తాయని అంటున్నారు.


మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమి అధికారంలోకి వస్తే అక్కడ శరద్ పవార్ ఎన్సీపీ రాజకీయ పాత్ర పరిసమాప్తంగానే చెప్పుకోవాలి. పవర్ రాజకీయవారసురాలు అయిన కుమార్తె సుప్రియకు   అంత పట్టు లేదని ఇప్పటికే తేలిపోయింది. ఇక కాంగ్రెస్ కి జాతీయ నాయకత్వమే ముఖ్యం. అక్కడ సోనియాగాంధీ చురుకుగా లేరు, రాహుల్ గాంధీ కాడి వదిలేశారు. ఆ తరువాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ని దూరం పెడితే ఇక జాతీయ రాజకీయాల్లో పెద్ద కుదుపు తప్పదని అంటున్నారు.


అదే విధంగా హర్యానాలో కూడా చూడాలి. అక్కడ మరోమారు మనోహర్ ఖట్టార్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాత్రం హస్త రేఖలు చెదిరిపోయినట్లేనని అంటున్నారు. కాంగ్రెస్ కి ఇప్పటివరకూ ఒక ఎన్నిక కాకపొతే మరో ఎన్నిక అన్న ఆశ ఉంటూ వచ్చింది కానీ ఇపుడు అది ఆవిరి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే దేశ రాజకీయాల్లో ఏకస్వామ్య పార్టీ వ్యవస్థ వస్తుంది. మోడీ, షా మరింతగా బలవంతులు అవుతారు. అది ప్రజాస్వామ్యానికే ప్రమాదం అంటున్నారు. ఎగిట్ పోల్స్ అన్నీ కూడా బీజేపీకి పట్టం కట్టిన సంగతి ఈ సందర్భంగా చూడాలి. అయితే ఎగిట్ పోల్స్ ని దాటి అసలు పోల్స్ తమకే విజయాన్ని ఇస్తాయని కాంగ్రెస్ నేతలు ధీమా పడుతున్నారు. మరి ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు ఎటు తీసుకెళ్తాయో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: