ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ రాజధాని 13 జిల్లాల ప్రజల ఆకాంక్షలను తీర్చే విధంగా ఉండాలని అన్నారు. దేశంలోనే మేటి రాజధానిని నిర్మిస్తామని బొత్స ప్రకటన చేశారు. ప్రభుత్వం కమిటీని నియమించిందని ఆరువారాల్లో కమిటీ సభ్యులు నివేదిక ఇస్తారని బొత్స అన్నారు. రాష్టంలో ఎక్కడ భవనం కట్టాలన్నా ఐదు నుండి పది అడుగులు తవ్వితే సరిపోతుందని అమరావతిలో మాత్రం వంద అడుగులు తవ్వాలని బొత్స అన్నారు. 
 
బొత్స సత్యనారాయణ విశాఖలోని వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ చంద్రబాబులో ఇంకా పరివర్తన రాలేదనిపిస్తోందని అన్నారు. చంద్రబాబు అమరావతిలో ఒక్కటైనా శాశ్వత భవనం ఎందుకు కట్టలేదని బొత్స ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర విభజన వలన జరిగిన నష్టం కంటే చంద్రబాబు ఐదేళ్ల పాలన వలన జరిగిన నష్టమే ఎక్కువని బొత్స వ్యాఖ్యనించారు. రాజధాని ఏర్పాటు గురించి రాష్ట్ర ప్రజలకు, వైసీపీ ప్రభుత్వానికి స్పష్టత ఉందని బొత్స అన్నారు. 
 
సీఎం జగన్ పాలన జనరంజకంగా ఉందని, తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులపై కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారని బొత్స వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యల గురించి బొత్స స్పందిస్తూ పవన్ కళ్యాణ్ కు అవగాహన లేదని కేంద్రం దగ్గర సీఎం జగన్ ఏ ప్రయోజనాలను తాకట్టు పెట్టారో చెప్పాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రాజధాని ఎంపిక కోసం నియమించిన జీఎన్ రావు కమిటీ నిన్న తొలిసారి భేటీ అయినట్లు సమాచారం. 
 
ఆరువారాలలోపు జీఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతుంది. ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందటం కొరకు తగిన సలహాలు, సూచనలను ప్రభుత్వానికి అందజేయనుంది. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కమిటీ నివేదిక తరువాత ప్రభుత్వం రాజధాని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: