పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి నల్లగొండ ఎంపీగా గెలిచిన అనంత‌రం రాజీనామాతో జరుగుతున్న ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఆధిక్యం తొలి రౌండ్ నుంచి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ పక్షాన పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ భార్య, కోదాడ మాజీ ఎమ్మెల్యే అయిన పద్మావతి పోటీలో నిలిచారు. బీజేపీ నుంచి కోట రామారావు, టీడీపీ నుంచి చావా కిరణ్మయి సహా స్వతంత్ర అభ్యర్థులతో కలిసి మొత్తం 28మంది హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక బరిలో నిలిచారు. కౌంటింగ్ మొద‌ల‌యిన సంద‌ర్భం నుంచి టీఆర్ఎస్ ఆధిక్యం క‌నిపిస్తోంది.  తొలి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 2,467 ఓట్ల ఆధిక్యం సాధించగా, రెండో రౌండ్‌లోనూ 4 వేల మెజార్టీతో సైదిరెడ్డి ముందంజలో ఉన్నారు.3 వ రౌండ్ ముగిసేసారికి 6550 ఆధిక్యంలో సైదిరెడ్డి ఉన్నారు
.
తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక ఉప ఎన్నిక జరుగుతుండడంతో పలు మీడియా, సర్వే సంస్థలు హుజూర్‌నగర్‌ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాయి. పోలింగ్‌ జరుగుతుండగానే ఓటరు నాడి పసిగట్టే పనిని చాణక్య, ఆరా వంటి సంస్థలు చేపట్టాయి. ఆయా సంస్థలు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయం అని తమ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల్లో వెల్లడించాయి. దీంతో ఓట్ల లెక్కింపుకు ముందే టీఆర్‌ఎస్‌ విజయంపై ధీమాగా ఉంది. ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం కనిపించింది. తాజాగా ఫ‌లితాల్లోనూ అదే త‌ర‌హా పరిస్థితులు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు. కాంగ్రెస్‌, బీజేపీలు వెనుకంజలో ఉన్నాయి. టీడీపీ అడ్రస్‌ లేకుండా పోయింది. రౌండ్‌ రౌండ్‌కు టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధిక్యం సాధిస్తుండడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం పెరుగుతోంది.


కాగా, ఈ స్థానంలో తొలిసారి విజయం కోసం అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ముందు నుంచి పక్కా ప్రణాళికతో పని చేసింది. బూత్‌ స్థాయిలో ప్రతి ఓటరునూ చేరేలా ఆ పార్టీ నాయకులు చేసిన కృషి చేశారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన శానంపూడి సైదిరెడ్డినే టీఆర్‌ఎస్‌ మరోసారి అభ్యర్థిగా నిలబెట్టింది. మ‌రోవైపు ఫ‌లితాలు తమకు అనుకూలంగా లేవని తెలిసి కాంగ్రెస్‌ నేతల్లో నిరుత్సాహం ఆవహించినట్లు కనిపిస్తోంది. పోలింగ్‌ తర్వాత ఒక్క ముఖ్య కాంగ్రెస్‌ నేత కూడా మీడియా ముందుకు రాకపోవడం ఆ పార్టీ నిస్తేజానికి నిదర్శనమ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: