హుజూర్ నగర్ ఉపఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అధికారులు మొత్తం 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు హుజూర్ నగర్ ఉపఎన్నిక పూర్తి స్థాయి ఫలితం వెలువడనుంది. సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్ లో కౌంటింగ్ కొనసాగుతోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ తరపున సైదిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరపున పద్మావతి, బీజేపీ పార్టీ తరపున రామారావు బరిలో నిలిచారు. 
 
21వ తేదీన జరిగిన పోలింగ్ లో హుజూర్ నగర్ నియోజకవర్గంలో 2,00,754 ఓట్లు పోలయ్యాయి. 7 మండలాల్లోని 302 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఉపఎన్నికలో మొత్తం 28 మంది పోటీ చేశారు. కానీ పోటీ మాత్రం ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉంది. ఈ రెండు పార్టీల అభ్యర్థులలో ఎవరు విజయం సాధిస్తారనే విషయంపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. హుజూర్ నగర్ ఉపఎన్నికలో ఏడో రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. 
 
ఏడో రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి 14,360 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండటం కూడా సైదిరెడ్డికి కలిసొచ్చిన అంశం అని తెలుస్తోంది. మహారాష్ట్ర, హరియాణా ఎన్నికలలో మాత్రం బీజేపీ పార్టీ ఆధిక్యత కొనసాగుతోంది. ఈ రెండు రాష్ట్రాలలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మహారాష్ట్ర, హరియాణాలో బీజేపీ, హుజూర్ నగర్ లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలలోను, ఉపఎన్నికలలోను భారీ పరాజయం తప్పటం లేదు. కొన్ని స్థానాలలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తోందని తెలుస్తోంది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: