తెలంగాణలోని హుజూర్ నగర్ లో  జరిగిన ఉప ఎన్నికలు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈరోజు వెలువడుతున్న ఫలితాల్లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. రౌండ్ రౌండ్ కి మెజారిటీ పెరుగుతోంది. ఐదో రౌండ్ లో 11వేల మెజారిటీతో దూసుకుపోతున్న కారు జోరుకు ఇప్పట్లో బ్రేకులు పడేలా లేవు. కనీసం 25వేల ఓట్ల మెజారిటీ వస్తుందని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.

 

 

ఉత్తర భారతదేశంలోని మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఫలితాల్లో ఇప్పటివరకూ మహారాష్ట్రలో బీజేపీ 63, శివసేన 31 స్థానాల్లో ముందంజలో ఉంది. హర్యానాలో కూడా బీజేపీ 36 స్థానాల్లో  ఆధిక్యంలో ఉంది. దీంతో ఇక  బీజేపీ గెలుపు లాంఛనమే. ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీకి, టీఆర్ఎస్ కు సమీప భవిష్యత్తులో ఎదురులేదని నిరూపిస్తున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత దేశంలో జరిగిన ఎన్నికలు కావడంతో అందరి చూపు ఈ ఫలితాల వైపే ఉన్నాయి. మోడీ నాయకత్వంపై ఎటువంటి అనుమానాలు లేవని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. హుజూర్ నగర్ ఉప ఎన్నిక విషయానికి వస్తే టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తోంది. ఆమధ్య ఇంటర్మీడియట్ విద్యార్థుల బలన్మరణాలు, ఇంటర్ వ్యవస్థ డొల్లతనం, ఇటీవలి ఆర్టీసీ సమ్మె.. ఇవేవీ ఆ పార్టీ గెలుపుకు కళ్లెం వేయలేకపోయాయి. ఈ విజయంతో ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ దూకుడును ప్రజలు సమర్ధించినట్టే.

 

 

ఇలా రెండు చోట్లా విజయాలతో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్.. తన ప్రత్యర్థి కాంగ్రెస్ ని చావు దెబ్బ తీశాయి. సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ పుంజుకునే పరిస్థితులు కానరావడం లేదు. ప్రత్యర్థిగా ఎన్ని ఎత్తులు వేస్తున్నా బీజేపీ, టీఆర్ఎస్ పైఎత్తులతో కాంగ్రెస్ కుదేలైపోతోంది. ఈ ఫలితాలపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో.. ఎలా సమీక్షించుకుంటుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: