మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు బీజేపీికి అనుకూలంగా వస్తున్నాయి. బీజేపీ + శివ‌సేన కూట‌మి అభ్య‌ర్థులు ఏకంగా 177 స్థానాల్లో ముందంజ‌లో ఉంటూ తిరుగులేని మెజార్టీతో మ‌రోసారి అధికారం దిశ‌గా దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ఎంఐఎం (మ‌జ్లిస్ ఇత్తెహ‌దుల్ ముస్లీమిన్) పార్టీ ఏకంగా 44 స్థానాల్లో భారీగా ఓట్లు సాధించింది. ఆ పార్టీ అభ్య‌ర్థులు కాంగ్రెస్ ఓటు బ్యాంకును భారీగా చీల్చ‌డంతో కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బ ప‌డిన‌ట్ల‌య్యింది. దీంతో బీజేపీ, శివ‌సేన కూట‌మికి భారీగా ల‌బ్ది క‌లిగిన‌ట్ల‌య్యింది.


ఇక ఇప్ప‌టి వ‌ర‌కు అందుతోన్న స‌మాచారం ప్ర‌కారం ఆ పార్టీ అభ్య‌ర్థులు 44 స్థానాల్లో భారీగా ఓట్లు చీల్చ‌గా నాలుగు స్థానాల్లో గెలుపు బాట‌లో దూసుకుపోతున్నారు. మహారాష్ట్రలో ఎంఐఎం ఒంటరిగానే పోటీ చేసింది. గ‌త కొంత‌కాలంగా ఎంఐఎం దేశ‌వ్యాప్తంగా ముస్లింల ప్రాబ‌ల్యం ఉన్న ప్రాంతాల్లో పోటీ చేస్తోంది. ఈ యేడాది జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోనూ హైద‌రాబాద్‌తో పాటు ఔరంగాబాద్ ఎంపీ సీటు కూడా గెలుచుకుంది.


ఇక గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ఔరంగాబాద్ సిటీలో రెండు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న ఎంఐఎం తాజా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఏకంగా ఔరంగాబాద్ ఎంపీ సీటే గెలుచుకుంది. అక్క‌డ నుంచి ఆ పార్టీ అభ్య‌ర్థి ఇంతియాజ్ ఆలీ ఎంపీగా గెలిచారు. ఇక తాజా ఎన్నిక‌ల్లో ఎంఐఎం ఔరంగాబాద్ సెంట్ర‌ల్‌, ఔరంగాబాద్ ఈస్ట్‌, కుర్లా, మ‌లేగో స్థానాల్లో విజ‌యం సాధించే దిశ‌గా దూసుకుపోతోంది. ఔరంగాబాద్ సిటీలోనే మ‌రో నియోజ‌క‌వ‌ర్గంలోనూ గ‌ట్టి పోటీ ఇస్తోంది.


ఇక ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఓ వైసీ ఎన్నికల ప్ర‌చారంలో పాల్గొని చేసిన డ్యాన్స్ కూడా ఎన్నిక‌ల ప్ర‌చారంలో బాగా హైలెట్ అయ్యింది. ఇక ఆయ‌న చేసిన ప్ర‌సంగాలు కూడా ముస్లిం ఓట‌ర్ల‌ను బాగా ఆక‌ట్టుకున్నాయి. దీంతో ఎక్కువ నియోజ‌క‌వ‌ర్గాల్లో ముస్లింల ఓట్లు ఆ పార్టీకి వ‌న్‌సైడ్‌గా ప‌డ్డాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: