హుజూర్ నగర్ ఉపఎన్నిక కౌంటింగ్ సరళితో తెలుగుదేశంపార్టీ పరిస్ధితి ఏమిటో అందరికీ మరోసారి అర్ధమైపోయింది. దాదాపు ఎనిమిది రౌండ్లు పూర్తయినా టిడిపికి వచ్చిన ఓట్లు మాత్రం చాలా చాలా తక్కవనే చెప్పాలి. అంటే కౌంటింగ్ సరళిని చూస్తుంటే అసలు పార్టీ అభ్యర్ధికి చావా కిరణ్మయికి కనీసం డిపాజిట్ అన్నా దక్కుతుందా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.

 

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణాలో టిడిపి పరిస్దితి దారుణంగా తయారైంది. రాష్ట్ర విభజన విషయంలో చంద్రబాబునాయుడు తీసుకున్న తప్పుడు నిర్ణయం ఫలితంగానే పార్టీకి ప్రస్తుత దుస్తితి పట్టిందన్నది వాస్తవం.  రాష్ట్ర విభజన నేపధ్యంలో చంద్రబాబు ఏదో ఊహించుకుని విభజనకు మద్దతు పలికారు. అయితే విభజన తర్వాత  తెలంగాణాలో పార్టీ కనుమరుగైపోతుందని ఊహించుండరు.

 

తెలంగాణాలో టిడిపి పరిస్దితి వెంటిలేటరపై ఉన్న పేషంట్ లాగ తయారైందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి నేపధ్యంలోనే  ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటంతో పరిస్దితి మరింత దిగజారిపోయింది. దాని తర్వాత తాజా ఉపఎన్నికలో పార్టీ తరపున అభ్యర్ధిని పోటికి దింపారు. అయితే పార్టీ పరిస్ధితిపై అంచనాకు రావటానికే చంద్రబాబు అభ్యర్ధిని పోటిలోకి దింపారని నేతలు చెబుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే తెలంగాణాలో పార్టీ పరిస్ధితిపై స్పష్టమైన క్లారిటి వచ్చేసినట్లే.


అంటే ఉపఎన్నికలో పార్టీ గెలిచేస్తుందనే భ్రమలు ఎవరిలోను లేవు. అయినా ఎందుకు పోటి పెట్టారంటే అసలు పార్టీ పరిస్ధితేంటో తెలుసుకోవాలన్నదే అసలు లక్ష్యం. నియోజకవర్గంలో సెటిలర్ల ఓట్లు ఎక్కువున్నాయి. అందులోను కమ్మ సామాజికవర్గం ఓట్లు కూడా బాగానే ఉన్నాయి. అందుకనే కనీసం ఓ 15, 20 వేల ఓట్లయినా వస్తుందని అంచనా వేసుకున్నారు. నిజంగా అలాగే వచ్చుంటే పార్టీ పరిస్ధితి బాగానే ఉన్నట్లే లెక్క. కానీ ఏడు రౌండ్లు గడచినా కనీసం వెయ్యి ఓట్లు కూడా రాలేదని సమాచారం.


ఉపఎన్నికల ఫలితంతో పార్టీ పరిస్దితేంటో తేలిపోయింది కాబట్టి ఇక మిగిలిందేమిటంటే ఎన్టీయార్ ట్రస్టు భవనాన్ని మూసేయటమే. ఇప్పటికే ట్రస్టు భవన్లో పార్టీ కార్యకలాపాలు తగ్గిపోయాయి. అందుకనే ట్రస్టు భవనం కాంపౌండ్ మొత్తాన్ని తమకు ఇచ్చేయమని ఎన్టీయార్ స్కూలు, కాలేజి ప్రిన్సిపాళ్ళు అడుతున్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీ మనుగడపై నిర్ణయం తీసుకుంటే అప్పుడు ట్రస్టుభవన్ పై నిర్ణయం వస్తుంది లేండి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: