అనుకున్నట్లే హుజూర్ నగర్ బై ఎలక్షన్ ఆర్టీసీ సమ్మెకు పెద్ద షాక్  ఇచ్చిందనే చెప్పాలి. తెలంగాణాలోని అనేక పార్టీలు, పక్షాలు టిఆర్ఎస్ ను పూర్తిగా వ్యతిరేకించాయి. అయినా ఉపఎన్నికలో అధికారపార్టీ సుమారుగా 25 వేల మెజారిటి దిశగా దూసుకుపోతోందంటే ఏమిటర్ధం ?  ఎన్నివర్గాలు టిఆర్ఎస్ ను వ్యతిరేకించినా ఆర్టీసీ సమ్మె ఎంత ఉధృతంగా జరుగుతున్నా అన్నింటినీ అధిగమించి టిఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి గెలుపు దిశగా దూసుకెళుతుండటమే ఆశ్చర్యంగా ఉంది.

 

ఆర్టీసీ సమ్మె నేపధ్యంలో  టిఆర్ఎస్ గెలుపు కష్టమనే ప్రచారం బాగా ఎక్కువగా జరిగింది. అయితే జరిగిన ప్రచారం అంతా తప్పని గెలుపు ఏకపక్షమే అన్న విషయం తేలిపోయింది. గెలుపు కోసం పోటిపడిన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బిజెపి, టిడిపిల ప్రభావం కూడా ఏదశలోను కనబడలేదు.

 

ఉపఎన్నిక ఫలితం నేపధ్యంలో ఇపుడు ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగింపుపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం కీలకమైంది. సమ్మె ప్రభావం వల్ల అభ్యర్ధి ఓడిపోతారనే ప్రచారం జరుగుతున్నా కెసియార్ సమ్మెను పట్టించుకోలేదు. అలాంటిది మంచి మెజారిటితో గెలుస్తున్నట్లు తేలిపోయిన తర్వాత సమ్మెను ఇపుడెందుకు లెక్క చేస్తారు ?

 

 కెసియార్ వైఖరి గమనిస్తే ఉపఎన్నికలో పార్టీ అభ్యర్ధి గెలిచినా, ఓడినా కూడా సమ్మెను లెక్క చేయరనే అనుకోవాలి. ఎలాగంటే గెలిస్తే ఏమో అందరూ వ్యతిరేకించినా తమ అభ్యర్ధి గెలిచాడు కాబట్టి సమ్మెను పట్టించుకోరు. ఒకవేళ అభ్యర్ధి ఓడిపోయుంటే తమ అభ్యర్ధిని అందరూ కలిసి ఓడగొట్టారు కాబట్టి కార్మిక సంఘాల మాటను లెక్క చేయాల్సిన అవసరం లేదని అనుకునే వారు.

 

అంటే కెసియార్ వైఖరిని గమనిస్తే తేలేదేమంటే ఉపఎన్నిక ఫలితం ఎలాగున్న నష్టపోయేది ఆర్టీసీయే అన్నది స్పష్టమని. ఉపఎన్నిక ఫలితం నేపధ్యంలో ప్రతిపక్షాలను, ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను కెసియార్ లెక్క చేయరన్నది తేలిపోయింది. కాబట్టి సమ్మె విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది న్యాయస్ధానం మాత్రమే.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: