ఏపీలో ప్రతిపక్ష టిడిపికి వరుస షాపుల పరంపరలో మరో అదిరిపోయే షాక్ తగలనుంది. రెండు రోజుల క్రితం ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ పార్టీ మారుతున్నట్లు ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఇప్పటికే బిజెపిలో చేరి పోగా... మరో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వెళ్లే ప్రయత్నాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ మారేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యే ఎవరో కాదు కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్.


వంశీ గత కొద్ది రోజులుగా పార్టీ మారుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ యేడాది జరిగిన సాధారణ ఎన్నికలకు ముందే ఆయన పార్టీ వార్తలు వచ్చినా ఆయన మాత్రం టీడీపీ నుంచి పోటీ చేశారు. ఇంత వ్యతిరేకతను ఆయన త‌ట్టుకుని వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై స్వల్ప తేడాతో విజయం సాధించి వరుసగా రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వాస్త‌వానికి ఎన్నిక‌ల‌కు ముందే ఆయ‌న వైసీపీలోకి దాదాపు వెళ్లిపోయిన‌ట్టే అనుకున్నా టీడీపీలోనే ఉన్నారు.


ఇక తాజాగా ఆయ‌న గురువారం గన్నవరంలో నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. దీంతో వంశీ పార్టీ మార్పు అంశంపై ఊహాగానాలు జరుగుతున్నాయి. తనపై కేసు నమోదు అయిన తర్వాత ఆయన నేడు తొలిసారి గన్నవరం వచ్చారు. వంశీ ఇప్పటికే కేసు నమోదుపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుని కలిశారు. నియోజకవర్గ నేతలతో వంశీ భేటీ నేపథ్యంలో పార్టీ మారే అంశంపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.


పార్టీ మార్పుపై ఆయ‌న మండలాల వారీగా కార్యకర్తలు నుంచి అభిప్రాయాలు సేకరణ తర్వాతే పార్టీ మార్పుపై వంశీ ఓ నిర్ణయానికి రానున్నట్టు తెలుస్తోంది. పార్టీ నాయ‌కుల అభిప్రాయం ఎలా ఉన్నా ఆయ‌న మాత్రం పార్టీ మార్పుపై ఓ ఆలోచ‌న‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. మంత్రి కొడాలి నాని ఈ విష‌యంలో మ‌ధ్య‌వ‌ర్తిగా ఉన్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ విష‌యం ఏపీ రాజ‌కీయాల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. వంశీ పార్టీ వీడితే టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బే.


మరింత సమాచారం తెలుసుకోండి: