ఒక్క బస్సు రాదు.. వచ్చిన బస్సులో ఇసుకేస్తే రాలనంత జనం.. ప్రైవేటు వాహనాల్లో వెళ్దామంటే డబుల్ ఛార్జీ.. ఇలా సామాన్య జనం అల్లాడుతున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించకపోవడం, ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం ప్రయాణికులకు సమస్యగా మారంది. నేడో.. రేపో.. సమస్య సమసిపోతుందిలే అనుకుంటూ ఇప్పటి దాకా ఓపిక పట్టారు. కానీ, ఇప్పుడు ఆ ఓపిన నశించేస్థాయికి చేరుతోంది. తెలంగాణ రాష్ట్రంలో గత 20 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైనా సమయానికి బస్సులు రాకపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. స్కూళ్లు, కాలేజీలకు ఆలస్యంగా వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. బస్సు స్టాప్ ల్లో విద్యార్థులు గంటల కొద్ది నిరీక్షిస్తున్నారు. అయినప్పటికీ ఏదో ఒక బస్సు వచ్చినా కూడా అదే బస్సులో కింద మీద పడుతూ స్కూళ్లు, కాలేజీలకు వెళ్లుతున్నారు. హైదరాబాద్ నగరంలోొ ఎక్కడా చూసిన ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. పాఠశాల విద్యార్థులను కొంత మేరకు తల్లిదండ్రులు వదిలి వెళ్లుతున్నప్పటికీ కాలేజీ విద్యార్థుల నరకయాతన అనుభవిస్తున్నారు. పైగా విద్యార్థినీల బాధ వర్ణనాతీతం.

హైదరాబాద్ నగరంలో ప్రధానంగా అమీర్ పేట, సంజీవ్ రెడ్డి నగర్, కూకట్ పల్లి, మియాపూర్, చందానగర్, పటాన్ చెరువు, బేగంపేట, కోఠి, దిల్ సుక్ నగర్, ఎల్బీ నగర్, తార్నాక, సికింద్రాబాద్, మాధాపూర్, గచ్చిబౌలి, ఖైరతాబాద్, అబిడ్స్ ప్రాంతాల్లో బస్టాప్ లో విద్యార్థి, విద్యార్థినీలు కుప్పలు తెప్పలుగా గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. విద్యార్థులకు బస్సు పాస్ లు ఉండడంతో వేరే రవాణా వ్యవస్థను ఎంచుకోలేకపోతున్నారు. ఒకవేళ వెళ్లాలన్నా చాలా ఖరీదుగా ఉంది. దీంతో ఆర్టీసీపైనే ఆధారపడుతున్నారు. స్కూల్ పిల్లలకు మరో రెండు రోజుల్లో త్రైమాసిన పరీక్షలు జరగనున్నాయి. అప్పుడు ఆలస్యంగా వెళ్లితే పిల్లలు పరీక్షలను రాయడం మరింత ఇబ్బందిగా ఉంటుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


స్కూళ్లు, కాలేజీలు ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకూ నడుస్తున్నాయి. కొన్ని కాలేజలు సాయంత్రం 5గంటల వరకూ కొనసాగుతున్నాయి. దీంతో విద్యార్థి, విద్యార్థినీలు తమ ఇళ్ల నుంచి ఉదయం 6గంటలకు బయలు దేరినప్పటికీ సకాలంలో తమ విద్యాలయాలకు చేరుకోవడం లేదు. సాయంత్రం ఇంటికి వెళ్లే సరికి రాత్రి 9గంటలు దాటిపోతుందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యార్థినీల తల్లిదండ్రులైతే మరింత ఆందోొళనకు గురౌతున్నట్లు సమాచారం. ఇక రాష్ట్రంలోని జిల్లాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. హైదరాబాద్ నగరంలో కొంత మేరకు ఇతర రవాణా వ్యవస్థను ప్రత్యామ్నాయంగా విద్యార్థులు ఎంపిక చేసుకునే అవకాశముంది. కానీ జిల్లాల్లో ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థ మరింత భారంగా ఉంది. ఈ వ్యవస్థ ద్వారానే విద్యార్థులు, రోజువారి పనులకు వెళ్లే వారు ప్రయాణించాల్సి ఉంటుంది. దీంతో జిల్లాల్లోని పల్లెల్లో చాలా మంది విద్యార్థులు విద్యాసంస్థలకు వెళ్లకుండా ఇళ్లల్లోనే ఉంటున్నట్లు తెలిసింది. జిల్లాస్థాయిలో కూడా అక్కడకక్కడా బస్సులు నడుస్తున్నప్పటికీ ప్రధాన రహదారుల్లోనే నడుస్తున్నాయి. అవీ కూడా మండల కేంద్రానికి ప్రధాన రహదారి ఉంటేనే అడపదడపా బస్సులు నడుస్తున్నాయి. అంతేకానీ మండల కేంద్రం నుంచి ఊళ్లకు వెళ్లే రహదారుల్లో బస్సులు నడవడం లేదు. దీంతో అయా ఉళ్లో నుంచి విద్యార్థులు తమ విద్యాసంస్థలకు రావాలంటే ఎలాంటి రవాణా వ్యవస్థ లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో మరో రెండు రోజుల్లో పాఠశాలల్లో జరగనున్న త్రైమాసిక పరీక్షలకు విద్యార్థులు ఏ విధంగా వెళ్లుతారని ప్రశ్నార్థకంగా మారింది.


ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రభుత్వం దసరా సెలవులను పొడిగించిన విషయం తెలిసిందే. విద్యాసంస్థల్లో సిలబస్ పూర్తి కాక ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతున్నారు. పైగా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోగా ఉపాధ్యాయులకు పాఠ్యాంశాలు భోదించేందుకు అనుకూలమైన సమయం. ఎందుకంటే జూన్ లో విద్యాసంస్థలు ప్రారంభమైనప్పటి నుంచి నూతన ప్రవేశాలు, అయా విద్యా సంస్థల బంద్ లు, స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఆటపోటీలు, తదితర కార్యక్రమాలు ఆగస్టు నెలాఖరు వరకూ కొనసాగుతాయి. దీంతో అయా విద్యాసంస్థల్లో సెప్టెంబర్ నెల నుంచి ఉపాధ్యాయులు పాఠ్యాంశాలపై పూర్తిస్థాయి ఫోకస్ పెడుతారు. కానీ రాష్ట్రంలో ఈ రెండు నెలల్లోనే ప్రభుత్వ నిర్లక్ష్య దోరణి వల్ల విద్యాసంస్థలు, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.


ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వల్ల విద్యార్థులు, ఇతరత్రా ఉద్యోగులు, ప్రజలు రవాణా వ్యవస్థ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం దిగి రావడం లేదు. సమ్మె ప్రబావంపై హైకోర్టు ఆదేశించినప్పటికీ సీఎం కే చంద్రశేఖరరావు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. ఈ పర్యావసనాలతో విద్యార్థులతో పాటు సకల జనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 21 నుంచి విద్యాసంస్థలు ప్రారంభమైన విషయం తెలిసిందే. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకూ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక సహనం నశించే ప్రభుత్వంపై అన్ని వర్గాలు ఏకమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. విద్యార్థుల భవిష్యత్, ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోని వెంటనే ఆర్టీసీ కార్మికులను చర్చలకు ఆహ్వనించి సమస్యను పరిష్కరించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: