పై ఫొటోల్లోని ఇద్దరు ఎవరో ఈపాటికే అర్ధమైపోయుంటుంది. అవును ఒకరు హుజూర్ నగర్ బై ఎలక్షన్లో బిజెపి తరపున పోటి చేసిన రామారావు, మరొకరు టిడిపి తరపున పోటి చేసిన చావా కిరణ్మయి. ఫలితాల సరళిని చూసిన తర్వాత రెండు పార్టీలు పరువును పోగొట్టుకున్నట్లైంది.  హుజూర్ నగర్ ఉపఎన్నికలో ఇపుడు ఈ ఇద్దరి మధ్యే ప్రధాన పోటి నెలకొందని రాజకీయంగా సెటైర్లు పెరిగిపోయాయి.

 

ఎందుకంటే గెలుపేమో టిఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డిని తేలిపోయింది. కాబట్టి రెండోస్ధానం కాంగ్రెస్ క్యాండిడేట్ పద్మావతికి ఖాయమైపోయింది.  గెలుపు ఖాయమైపోయిన తర్వాత బిజెపి, టిడిపి అభ్యర్ధుల విషయంలో కొత్తగా తేలాల్సిందేముంది ? ఏముందంటే మూడు, నాలుగు స్ధానాల విషయంలో ఏ పార్టీ నిలుస్తుందనే విషయం మొదటిది. ఇక రెండో విషయం ఏమిటంటే అసలు రెండు పార్టీలకు డిపాజిట్లు దక్కుతాయా ? అన్నదే.

 

నిజానికి ఉపఎన్నికలో బిజెపి, టిడిపిలు పోటి చేయటం కూడా దండగే అన్న వాతావరణమే మొదటి నుండి కనబడుతోంది. కానీ పై రెండు పార్టీల్లోని మితిమీరిన ఆత్మవిశ్వాసమే చివరకు రెండు పార్టీల పరువును తీసేశాయి. మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఏదో అదృష్టం కొద్దో లేకపోతే టిఆర్ఎస్, కాంగ్రెస్ చేసిన పొరబాట్ల వల్లో బిజెపి నాలుగు పార్లమెంటు స్ధానాల్లో గెలిచింది.

 

 ఎప్పుడూ లేని రీతిలో ఏకంగా నాలుగు ఎంపి సీట్లలో గెలవటంతోనే బిజెపి నేతలు నేలమీద నడవటం మానేశారు. కేంద్రంలోని నరేంద్రమోడి ప్రభావం వల్లే తెలంగాణాలో తమకు నాలుగు ఎంపి సీట్లు వచ్చాయంటూ ఒకటే ఊదరగొట్టేశారు.

 

నిజానికి బిజెపి గెలిచిన నాలుగు స్ధానాల్లోను ఆ పార్టీకి బలమే లేదు. అయినా గెలిచిందంటే అభ్యర్ధుల అదృష్టమనే అనుకోవాలి. సరే టిడిపి గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా ఎక్కువే అవుతుంది. ఈ నేపధ్యంలోనే కుమ్మేస్తాం, పొడిచేస్తాం అంటూ రెండు పార్టీలో పోటిలోకి దిగాయి. చివరకు 7 రౌండ్ల తర్వాత కూడా ఇద్దరు అభ్యర్ధులకు డిపాజిట్లు దక్కటమే మహాభాగ్యం అన్నట్లు తయారైంది పరిస్దితి.


మరింత సమాచారం తెలుసుకోండి: