హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల‌పై ఆర్టీసీ కార్మికుల స‌మ్మె ప్ర‌భావం క‌నిపించ‌లేదు. అంద‌రి అంచ‌నాల‌ను త‌లకిందులు చేస్తూ హుజూర్‌న‌గ‌ర్ ప్ర‌జ‌లు అధికార టీఆర్ఎస్ పార్టీకే ప‌ట్టం క‌ట్టారు. ప్ర‌భుత్వానికే అండ‌గా నిలిచారు. ఆర్టీసీ కార్మికుల‌పై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్న గులాబీ ద‌ళ‌ప‌తి, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు హుజూర్‌న‌గ‌ర్ ప్ర‌జ‌లు త‌గిన గుణ‌పాఠం చెబుతార‌ని, ఈ ఎన్నిక‌తో కేసీఆర్ ప‌త‌నం ప్రారంభం అయిన‌ట్టేన‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ.. తాజాగా వెలువ‌డిన ఫ‌లితాల్లో మొద‌టి రౌండ్ నుంచే టీఆర్ఎస్ అభ్య‌ర్థి సైదిరెడ్డి ఆధిక్యం ప్ర‌ద‌ర్శించారు.


కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి ప‌ద్మావ‌తిరెడ్డి ఒక్క‌రౌండ్‌లోనూ ఆధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోయారు. దీంతో అర్థ‌మ‌వుతుంది.. హుజూర్‌న‌గ‌ర్ ప్ర‌జ‌లంద‌రూ గంప‌గుత్త‌గా గులాబీకే ఓట్లు వేశార‌ని. ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంద‌ని అంటున్నారు. నిజానికి.. రాజ‌కీయంగా అత్యంత సంక్లిష్ట ప‌రిస్థితుల మ‌ధ్య హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కాగానే.. పార్టీ అభ్య‌ర్థిగా సైదిరెడ్డిని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. అంతేస్పీడ్‌గా బాధ్యుల‌ను నియ‌మించారు. భారీ సంఖ్య‌లో నేత‌ల‌ను పంపించారు.


ఈ ఎన్నిక‌ను పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలెంజ్‌గా తీసుకున్నారు. ఈనెల 4న నియోజ‌క‌వ‌ర్గంలో రోడ్ షో కూడా నిర్వ‌హించారు. అయితే.. అనూహ్యంగా ఈనెల 5వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు స‌మ్మె ప్రారంభించ‌డంతో ప‌రిస్థితులు ఒక్క‌సారిగా మారిపోయాయి. ఆ త‌ర్వాత కేటీఆర్ త‌న ప‌ర్య‌ట‌న‌ల‌ను ర‌ద్దుచేసుకున్నారు. ఆఖ‌రికి ఈనెల 17వ తేదీన నిర్వ‌హించాల‌నుకున్న కేసీఆర్ స‌భ కూడా భారీ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయింది.


ఈ నేప‌థ్యంలో హుజూర్‌న‌గ‌ర్‌కు సీఎం రాలేక‌నే స‌భ‌ను ర‌ద్దు చేసుకున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పించాయి. నిజానికి.. సామాన్య ప్ర‌జ‌ల్లోనూ ఉత్కంఠ నెల‌కొంది. ఒక‌వైపు ఆర్టీసీ కార్మికుల‌కు అన్నివ‌ర్గాల నుంచి మ‌ద్ద‌తు పెర‌గ‌డం, హైకోర్టు కూడా ప్ర‌భుత్వంపై సీరియ‌స్ కావ‌డం.. ఇలా అనేక ప్ర‌తికూల అంశాలు ఉన్న నేప‌థ్యంలో హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల పోలింగ్ ఈనెల 21న జ‌రిగింది. దీంతో ఫ‌లితం ఎలా ఉండ‌బోతుందోన‌ని అంద‌రూ అనుకున్నారు.


త‌మ సిట్టింగ్ స్థానంలో గెల‌వ‌డం ఖాయ‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు కూడా అనుకున్నారు. కానీ.. అనూహ్యంగా ఓట్ల లెక్కింపులో మొద‌టి రౌండ్ నుంచే టీఆర్ఎస్ అభ్య‌ర్థి సైదిరెడ్డి ఆధిక్య‌త‌ను చూపారు. అది రౌండ్‌రౌండ్‌కూ పెరుగుతూ పోయింది. దీంతో హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల‌పై ఆర్టీసీ కార్మికుల స‌మ్మె ప్ర‌భావం ఏమాత్రమూ చూప‌లేద‌ని గులాబీశ్రేణులు అంటున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: