అందరూ ఊహించినట్లే మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్టీయే కూటమి ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఎన్టీయేలో కూడా బిజెపియే మెజారిటి సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే అంతిమ ఫలితాలు వెలువడనప్పటికీ  మిత్రపక్షం శివసేన  మాత్రం అప్పుడే బిజెపికి గట్టి ఫిట్టింగ్ పెట్టేసింది. ముఖ్యమంత్రి పీఠాన్ని తమకే కేటాయించాలంటూ శివసేన కీలక నేత సంజయ్ రౌత్  మెలికపెట్టటంతో బిజెపి అగ్రనేతలు కంగుతిన్నారు.

 

ఇప్పటికి వరకూ వెలువుడుతున్న ఆధిక్యతల్లో బిజెపి  105 సీట్లు, శివసేన 62 సీట్లలో ముందంజలో ఉంది. 288 సీట్ల అసెంబ్లీలో ఇద్దరికి కలిపి స్పష్టమైన మెజారిటి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంది. అదే సమయంలో ఏ ఒక్కరికీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమూ లేదన్నది వాస్తవం. అందుకనే మిత్రపక్షాలు గనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే రెండు కలిసే ఉండాలన్నది చాలా కీలకమైన సూత్రం.

 

ఇక్కడే శివసేన చురుగ్గా పావులు కదుపుతున్నది. ఠాక్రే కుటుంబం నుండి మొదటిసారిగా పోటి చేసిన బాల్ ఠాక్రే మనవడు, ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆధిత్య ఠాక్రే కే సిఎం పదవి ఇచ్చి తీరాలంటూ శివసేన గట్టిగా పట్టుబట్టింది. ఎందుకంటే ఎన్నికలకు ముందు రెండు పార్టీల మధ్య కుదిరిని పొత్తులో ప్రభుత్వం ఏర్పాటులో 50: 50 భాగస్వామ్యం ఉండాలన్నది ఒప్పందమని ఇపుడు సంజయ్ రౌత్ చెబుతున్నారు.

 

నిజానికి మిత్రపక్షాల్లో ఏ పక్షానికి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీ తరపున ముఖ్యమంత్రి అవుతారన్న విషయం అందరికీ తెలిసిందే.  తక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీ అభ్యర్ధి ముఖ్యమంత్రవ్వటం అసాధారణ పరిస్దితుల్లో మాత్రమే మనం చూస్తుంటాం. కాబట్టి సహజ న్యాయసూత్రం ప్రకారమైతే బిజెపి అభ్యర్ధే మహారాష్ట్ర ముఖ్యమంత్రవ్వాలి. కానీ మెజారిటి తథ్యమని, అధికారంలోకి రావటం ఖాయమని తేలిపోయిన తర్వాతే శివసేన ముఖ్యమంత్రి పదవి తమకే కావాలని పట్టుబట్టటం గమనార్హం. మరి శివసేన డిమాండ్ పై బిజెపి అగ్రనేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: