రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అన్న మాటలు  ఉండవు  అన్న విషయం మరొకసారి కేసీఆర్ గారు రుజువు చేశారు. రెండు సార్లు ఆయన మీద పోటీ చేసి ఓడిపోయిన వంటేరు ప్రతాప్ రెడ్డి కి కీలక పదవిని అప్పగించి అందరిని ఆశ్చర్యం లో ముంచారు కేసీఆర్ గారు, దీని గురించి వివరాల్లోకి వెళితే ఇలా ఉన్నాయి. గజ్వేల్‌లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగి.. కేసీఆర్‌ చేతిలో రెండుసార్లు ఓడి.. 2018 ఎన్నికల ఫలితాల తర్వాత కారెక్కిన వంటేరు ప్రతాపరెడ్డిని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.


వంటేరు ప్రతాప రెడ్డి ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు. కొత్త చైర్మన్‌ విధులు నిర్వహించేందుకు వీలుగా ఆయనకు కార్యాలయం, వాహనాలు, సిబ్బంది, ఇతర సౌకర్యాలు కల్పించాల్సిందిగా పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖను ప్రభుత్వం ఆదేశించింది.మంత్రి పదవులు దక్కని, ఎన్నికల్లో ఓడిన టీఆర్ఎస్ నేతల్లో.. తమకు కూడా నామినేటెడ్ పదవులు దక్కుతాయనే ఆశలు చిగురిస్తున్నాయి.

మాజీ స్పీకర్ మధుసూదనాచారి, జూపల్లి, నాయిని, కడియం, పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ తదితరులు ఈ రేసులో ఉన్నారు.2018 ఎన్నికల వరకు వంటేరు ప్రతాప రెడ్డి.. కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరించారు. కేసీఆర్ తన బద్ధ శత్రువని ప్రకటించారు. 2014 ఎన్నికల్లో కేసీఆర్ చేతిలో 19 వేల ఓట్ల తేడాతో ఓడిన వంటేరు.. 2018 ఎన్నికల్లో 56 వేల ఓట్ల తేడాతో ఓడారు. టీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావుతోనూ ఆయనకు వైరం ఉందని చెబుతారు.


ప్రతాప్‌రెడ్డి నియామకం నేపథ్యంలో ఆయన బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో అటవీ సంపదను పరిరక్షించడంతో పాటు, పచ్చదనం పెంపుదలకు కృషి చేయాల్సిందిగా సీఎం కేసీఆర్‌ సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: