రాజకీయం అంటేనే రాజీతో నడిచే జీవితం ఇందులో ఎవరికి ఎవరు శాశ్వత శత్రువులు, మిత్రులంటూ ఉండరు. అందరు గోడమీది పిల్లులే. ఇక ఇక్కడ ఏక్షణం ఏం జరుగుతుందో ఊహించలేం. గడ్డిపోచలా పీకేసిన, పార్టీ గాని అలాంటి పార్టీలోని నాయకులు గాని సడెన్‌గా ఎదగవచ్చూ. ఇప్పుడు ఇదేజరిగింది. హర్యానా ఎన్నికల ఫలితాలు ఒక్కసారిగా యావత్ దేశ దృష్టిని ఆకర్షించాయి. రాజకీయ పండితులు వేసిన అంచనాలు తలకిందులు అయ్యాయి. ఓటర్ల నాడి పట్టుకోవడంలో ఎగ్జిట్ పోల్స్ సైతం విఫలం అయ్యాయి. ఇకపోతే హర్యానాలో అధికారం మాదే అని అనుకున్న భారతీయ జనతాపార్టీ చతికిలపడింది. హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన కారణంగా, అధికారాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ను ఏ పార్టీ కూడా అందుకోలేకపోయింది.


భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని అందుకోలేక నిరసించి పోయాయి. ఫలితంగా హర్యానా రాజకీయ రంగంలోకి దిగిన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) అధినేత దుష్యంత్ చౌతాలా ఇక తాజాగా ‘ చక్రం ‘ తిప్పబోతున్నారు. కీ గుర్తు కలిగిన ఈయన పార్టీ నిజంగానే కీ రోల్ పోషించబోతోంది. ఓట్ల లెక్కింపు సరళిని బట్టి చూస్తే.. ఈయన ‘ కింగ్ మేకర్ ‘ గా అవతరించినా ఆశ్చర్యం లేదు. ఈ ట్రెండ్ చూస్తే మా పార్టీ చేతిలోనే ‘ కీ ‘ ఉన్నట్టు ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు మార్పును కోరుకున్నారని, హర్యానా అసెంబ్లీ.. జేజేపీ ‘ తాళం ‘ తోనే తెరుచుకుంటుందని ఆయన చమత్కరించారు.


ఆయన పార్టీకి ఏడు నుంచి 10 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ తాజా సమాచారం ప్రకారం.. 11 సీట్లలో ఈ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదని వెల్లడవుతున్న నేపథ్యంలో.. ఎవరికి మద్దతునిస్తామన్న విషయమై దుష్యంత్ చౌతాలా క్లారిటీ ఇవ్వలేదు. తానొక్కడినే నిర్ణయం తీసుకోలేనని, తమ పార్టీకి జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందని, ఆయన తెలిపారు. ఇకపోతే దుష్యంత్ సింగ్.. మాజీ ఉప ప్రధాన మంత్రి చౌదరి దేవీలాల్ మునిమనవడు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా మనవడు.


ఇదివరకు దుష్యంత్ చౌతాలా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ లో కొనసాగారు. అనంతరం ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి,  ఏడాది కిందటే సొంతంగా జన్ నాయక్ జనతాపార్టీని స్థాపించారు. ఇక తన తాత దేవీలాల్ కు ఉన్న పేరు ప్రతిష్ఠలను నిచ్చెనగా వాడుకుని. హర్యానా రాజకీయాల్లో ఓ కెరటంలా దూసుకొచ్చారు. పార్టీ ఏర్పాటు చేసిన అనంతరం ఎదుర్కొన్న తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే.. రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ఎదగడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది... 


మరింత సమాచారం తెలుసుకోండి: