ఏపీ ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్‌సీపీ నాయ‌కుడు వైఎస్ స‌న్నిహితుడ‌నే పేరున్న పార్టీ అధికార ప్ర‌తినిధి ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ అధినేత‌పై ఇటీవ‌లి కాలంలో తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్న జ‌న‌సేన‌ పార్టీ అధ్య‌క్షుడు, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఊహించ‌ని సల‌హా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సొంతంగా నిలదొక్కుకోనే ప్రయత్నం చేయాలని అంబ‌టి సూచించారు. ముఖ్య‌మంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధ్య‌క్షుడు చంద్రబాబు, జ‌న‌సేన అధ్య‌క్షుడు పవన్ కళ్యాణ్ సందర్భానుసారం ఒకే విమర్శలు ఇద్ద‌రూ చేస్తున్నారని ఆయ‌న ఎద్దేవా చేశారు. చంద్రబాబు డీఎన్ఏ పవన్ కళ్యాణ్ డీఎన్ఏ ఒకటే కాబట్టి ఇద్దరు ఒకేలా మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు. 


వైఎస్ఆర్‌సీపీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన అంబ‌టి రాంబాబు జ‌న‌సేన అధ్య‌క్షుడు పవన్ కళ్యాణ్ బరితెగించి సీఎంపై విమర్శలు చేస్తున్నారని మండిప‌డ్డారు. జగన్మోహన్‌రెడ్డిపై కేసులు విచారణ జరుగుతుంటే నేరస్తుడు అని ఎలా అంటారని ఆయ‌న సూటిగా ప్ర‌శ్నించారు. నేరారోపణలు ఎదుర్కొంటున్నావారు నేరస్తులు కాదని పేర్కొన్న అంబ‌టి...వేల పుస్తకాలు చదివానంటున్న పవన  కళ్యాణ్‌కు ఆ సంగతి తెలియదా అని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఎవరికోసమో రాజకీయాలు చేయవ‌ద్దని అంబ‌టి సూచించారు. ప్రకాశం జిల్లాలో వలసలు సంగతి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీలో వలసలు అపుకోవాలని అంబ‌టి సెటైర్ వేశారు. ``చంద్రబాబు ఉదయం మాట్లాడింది సాయింత్రం పవన్ కళ్యాణ్  మాట్లాడుతున్నారు...చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్.. చంద్రబాబుతో లాలూచీ రాజకీయాలు చేసింది పవన్ కళ్యాణ్...కుప్పం, మంగళగిరిలో చంద్రబాబు, లోకేష్‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఎందుకు పోటీ పెట్టలేదు? జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్ కళ్యాణ్ కు లేదు. రెండు చోట్ల పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ప్రజలు ఎందుకు ఓడించారో తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ ఓడిపోయిన చోట ఇప్పటి వరకు మొహం చూపించలేదు`` అని మండిప‌డ్డారు. 


పవన్ కళ్యాణ్ సొంతంగా నిలదొక్కుకోనే ప్రయత్నం చేయాలని అంబ‌టి వ్యాఖ్యానించారు. ``గతంలో పోటీ చేయకుండా చంద్రబాబు సీఎం కావాలని కోరుకున్న పవన్ కళ్యాణ్ మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి చంద్రబాబు సీఎం కావాలని పవన్ కళ్యాణ్ కోరుకున్నారు. చంద్రబాబును నమ్ముకొని రాజకీయాలు చేస్తే ప్రజలు పవన్ కళ్యాణ్‌ను తిరస్కరిస్తారు. సొంతంగా రాజకీయాలు చేస్తే నాలుగు సీట్లు అయిన పవన్ కళ్యాణ్‌కు వస్తాయి..`` అని పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: