దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతోన్న ఉప ఎన్నిక‌ల‌తో పాటు మ‌హారాష్ట్ర‌, హరియాణా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ బీఏపీకి ఊహించని షాకులు త‌గులుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలు సైతం త‌ల్ల‌కిందులు అవుతున్నాయి. మహారాష్ట్రలోని సతారా లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ ఉప ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ గెలుస్తామ‌ని భావించిన బీజేపీకి దిమ్మ‌తిరిగే షాక్ త‌గిలింది.


సరిగ్గా లోక్‌సభ ఎన్నికల ముందు ఎన్సీపీని వీడి బీజేపీలో చేరిన ఉదయన్‌రాజే భోసలేకి ఓటర్లు భారీ షాక్ ఇచ్చారు. ఆయ‌న గ‌త మూడు ఎన్నిక‌ల్లోనూ స‌తారా లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తూ ఘ‌న‌విజ‌యాలు సాధిస్తూ వ‌చ్చారు. తాజా ఎన్నిక‌ల ఫ‌లితాలు చూస్తే ఆయ‌న ఘోరంగా ఓడిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఆయ‌న త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి ఎన్సీపీ అభ్యర్థి శ్రీనివాస్ పాటిల్‌పై 82 వేల ఓట్ల మేర వెనుకంజలో ఉన్నారు.


భోసలే ఎన్సీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో సతారాలో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇక ఎన్సీపీకి రాజీనామా చేసిన బోస‌లే బీజేపీ టిక్కెట్‌పై పోటీలో ఉండ‌డంతో ఆయ‌న‌పై పోటీకి ఎన్సీపీ కురువృద్ధుడు శరద్ పవార్ స్నేహితుడు శ్రీనివాస్ పాటిల్ పోటీకి దిగారు. 2009, 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ టికెట్‌పై వరుసగా విజయం సాధించిన భోసలే ఈసారి ఎన్నికల్లో భారీగా వెనుకబడడం గమనార్హం.


ఇక బోస‌లే గ‌తంలో బీజేపీ అధికారంలో ఉన్న‌ప్పుడు మంత్రిగా కూడా ప‌నిచేశారు. బోస‌లే మ‌హారాష్ట్ర వీరుడు చ‌త్ర‌ప‌తి శివాజీ రాజ‌కుంటుబానికి చెందిన వ్య‌క్తి కావ‌డం విశేషం. ఏదేమైనా ఐదు నెల‌ల క్రితం లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో గెలిచిన బెస‌లే ఇప్పుడు ఓడిపోవ‌డం...అందులోనూ బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బే. ఇక అటు మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ బీజేపీకి ఆశించిన స్థాయిలో సీట్లు రావ‌డం లేదు. ఇక మ‌రోవైపు శివ‌సేన ఇప్ప‌టికే త‌మ‌కు సీఎం పీఠం కావాల‌ని వార్నింగ్‌ల మీద వార్నింగ్‌లు ఇస్తోంది. ఈ నేప‌థ్యంలో బీజేపీకి మ‌హా ఎన్నిక‌లు పెద్ద చిక్కునే మిగిల్చాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: