ఉత్కంఠ సృష్టించిన ఉప ఎన్నిక‌లో తుది ఫ‌లితం వ‌చ్చేసింది. సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ స్కెచ్ ఫ‌లించింది. 43,284 ఓట్ల మెజార్టీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విజయం సాధించారు. భారీ మెజార్టీతో శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌ పద్మావతిరెడ్డిపై గెలుపొందారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పద్మావతి రెండో స్థానానికి పరిమితం కాగా, మూడో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి సపావత్‌ సుమన్‌ నిలిచాడు. బీజేపీ నాలుగో స్థానానికి, టీడీపీ ఐదో స్థానానికి పడిపోయింది.


ఈ ఉప ఎన్నికలో సైదిరెడ్డి గెలుపొంద‌డ‌మే కాకుండా... రికార్డు బ్రేక్‌ చేశారు. మొత్తం 22 రౌండ్లలోనూ సైదిరెడ్డినే ఆధిక్యం ప్రదర్శించారు. తొలి రౌండ్‌ నుంచి సైదిరెడ్డి ఆధిక్యం ప్రదర్శించ‌గా.. ఏ రౌండ్‌లోనూ కూడా పద్మావతి లీడ్‌లో లేకుండా పోయారు.  భారీ మెజార్టీతో విజయాన్ని కైవసం చేసుకోవ‌డ‌మే కాకుండా...ఈ నియోజకవర్గంలో సైదిరెడ్డికి వచ్చిన మెజార్టీ ఇప్పటి వరకు ఏ అభ్యర్థికి రాక‌పోవ‌డం టీఆర్ఎస్ శ్రేణుల‌ను సంతోషంలో తేలియాడేలా చేస్తోంది.

నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్లు 2 లక్షల 751. మండలానికి 5 పోలింగ్ కేంద్రాల చొప్పున వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు చేపట్టారు.  22 రౌండ్ల పాటు ఓట్ల లెక్కింపు జ‌రిగింది.  ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభంకాగా మ‌ధ్యాహ్నం 2.40 నిమిషాల ప్రాంతంలో తుది ఫ‌లితం వెలువ‌డింది. ఈ ఫ‌లితంతో స‌హ‌జంగానే కాంగ్రెస్ శ్రేణులు నిరాశ‌లో కూరుకుపోయాయి. మ‌రోవైపు కాంగ్రెస్ ఇలాకా అయిన హుజుర్‌నగర్‌ గడ్డపై గులాబీ జెండాను రెపరెపలాడిన నేప‌థ్యంలో తెలంగాణ భవన్‌లో అటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి. భారీ మెజార్టీతో గెలుపొందిన సైదిరెడ్డికి టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ సాయంత్రం 4 గంట‌ల‌కు పార్టీ ప్ర‌ధాన కార్యాల‌య‌మైన తెలంగాణ‌భ‌వ‌న్‌లో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడ‌నున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: