మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీట్ల సర్దుబాటు విషయంలో వాదులాడుకున్న పార్టీలు రెండు ఆ తర్వాతా కూటమిగా మారి పోటీ చేసాయి. ఇప్పుడు అదే  బీజేపీ-శివసేన కూటమి స్పష్టమైన ఆధిక్యత సాధించేసే దిశగా దూసుకుపోతున్న వేళ శివసేన కొత్త డిమాండును తెరపైకి తెచ్చింది. ప్రభుత్వ ఏర్పాటులో 50 : 50 ఫార్ములా అనుసరించాలని ఈ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ అంటున్నారు. అంటే టూకీగా చెప్పాలంటే ముఖ్యమంత్రి పదవి శివసేనకే ఇవ్వాలన్నదే ఆ డిమాండ్. ఇకపోతే ఒక వైపు ఫలితాలు ప్రకటిస్తుండగానే శివసేన నుంచి ఈ డిమాండ్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.


అందుకు ఆయన చెబుతున్న కారణం…బీజేపీకి గతంలో కంటే ఆరు స్థానాలు తక్కువ రావడమే. 2014 ఎన్నికలలో బీజేపీ, శివసేనలు వేరువేరుగా పోటీ చేసి ఎన్నికల అనంతరం పొత్తు పెట్టుకున్నాయి. దీంతో అప్పట్లో కంటే బీజేపీ ఇప్పుడు సీట్ల సర్దుబాటు కారణంగా కేవలం 164 స్థానాలలోనే పోటీ చేసింది. గతం కంటే ఆరుసీట్లు తక్కువ రావడానికి ఇదే కారణమని బీజేపీ చెబుతున్నది. అయితే శివసేన మాత్రం ముఖ్యమంత్రి పదవి విషయంపై గట్టిగా పట్టుబట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇకపోతే  సంజయ్ రౌత్ మాట్లాడుతూ అసలు ఈ ఎన్నికకు ముందే ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములాపై బీజేపీతో అంగీకారం వచ్చిందని,


అయిదేళ్ల సీఎం పదవీ కాలాన్ని రెండున్నరేళ్ల చొప్పున పంచుకోవాలని శివసేన కోరే అవకాశం కూడా ఉందని చూచాయగా పేర్కొన్నారు. ఇక ఈ ఎన్నికల్లో 126 స్థానాలకు పోటీ చేసిన శివసేన 64 చోట్ల లీడింగులో ఉంది. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని (288) సీట్లకూ పోటీ చేసిన ఈ పార్టీ.. 63 స్థానాలను గెలుచుకుంది. కాగా-సగం సగం పదవులు పంచుకోవాలన్న ప్రతిపాదనను బీజేపీ అంగీకరించలేదు. ఆ మధ్య ఈ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా.. ఈ డీల్ పై ఉద్ధవ్ థాక్రే వద్ద ప్రస్తావించారు. కానీ శివసేనకు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ ఇచ్చారు. అయితే ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ 300 మంది శివసేన కార్యకర్తలు, 20 మందికి పైగా కార్పొరేటర్లు రాజీనామా చేశారు. కానీ ఉద్ధవ్ దీన్ని తేలిగ్గా తీసుకున్నారు. సోదరుల్లో ఎవరు పెద్ద, ఎవరు చిన్న అన్నది ముఖ్యం కాదని, వారి మధ్య మంచి సంబంధాలే ముఖ్యమని ఆయన అన్నారు. తాజాగా.. సంజయ్ రౌత్ చేసిన డిమాండ్ పార్టీలో కలకలం రేపినా ఆశ్చర్యం లేదంటున్నారు ఆ పార్టీలోని కొందరు పెద్దలు...


మరింత సమాచారం తెలుసుకోండి: