తెలంగాణలో త్వరలోనే పురపోరుకు నగారా మోగనుంది. ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ప్రగతిభవన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఎలక్షన్స్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. వచ్చే వారం నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం కనిపిస్తోంది. 


తెలంగాణ రాష్ర్టంలో పురపాలక ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికల ప్రక్రియను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేయంతో.. నవంబరు 21లోపు ఎన్నికలు పూర్తి చేసే దిశగా పురపాలక శాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్లు జరిగితే.. నవంబరు మొదటి వారంలో ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 68 పురపాలక సంఘాలకు సంబంధించి వార్డుల పునర్విభజన కేసులు హైకోర్టు సింగిల్‌ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం తీసుకున్న చర్యలను కోర్టుకు నివేదించిన క్రమంలో హైకోర్టు తాజా తీర్పు ప్రతిలోని అంశాల ఆధారంగా కేసును కొలిక్కి తెచ్చేందుకు పురపాలక శాఖ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా రిజర్వేషన్ల జాబితా అందిన వెంటనే... ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. 


ఎన్నికలు జరగాల్సిన పురపాలక సంఘాలు, కార్పొరేషన్ లలో జులై రెండో తేదీ నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. పట్టణ స్థానిక సంస్థలకు జాప్యం లేకుండా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం కోర్టుకు నివేదించనుంది. నోటిఫికేషన్‌ నుంచి పోలింగ్‌ వరకూ 15 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసేలా కొత్త పురపాలక చట్టంలో మార్పులు చేశారు.  ఇది కూడా అనుకున్న సమయానికి ఎన్నికల నిర్వహణకు సానుకూలంగా మారనుంది. హైకోర్టు తీర్పు క్రమంలో పుర ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 29న వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనుంది. పురపాలక కమిషనర్లతో పాటు ఎన్నికల నిర్వహణలో భాగస్వాములయ్యే ముఖ్య అధికారులతో నిర్వహించే ఈ వీసీలో ఎన్నికల సంఘం అన్ని అంశాలనూ చర్చించనుంది. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఆరు నగరపాలక సంస్థలు ఉండగా.. కొత్తగా ఏడింటిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో జిల్లెలగూడ, మీర్‌పేట పురపాలక సంఘాలను కలిపి మీర్‌పేట కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు. దీంతో మీర్‌పేట కార్పొరేషన్‌లో డివిజన్లను పునర్విభజన చేయాల్సి ఉంటుంది. ఇందుకు కనీసం వారం రోజులు పట్టే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: