హుజూర్ నగర్ ఉప ఎన్నిక గెలుపు జోష్ లో ఉన్న అధికార టీఆరెస్ నాయకత్వం, వీలైనంత త్వరగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది . నవంబర్ లోపే మున్సిపోల్స్ ను ముగించాలని యోచిస్తోంది . దాంతో ప్రతిపక్షాలకు ఏమాత్రం తేరుకునే అవకాశం ఉండదని టీఆరెస్ నాయకత్వం అంచనా వేస్తోంది . వారం రోజుల వ్యవధి లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు టీఆరెస్ నాయకులు చెప్పకనే చెబుతున్నారు .


హుజూర్ నగర్ ఉప ఎన్నిక లో విజయం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా తో  మాట్లాడుతూ రెండు, మూడు రోజుల వ్యవధిలో ప్రభుత్వానికి ఎన్నికల సంఘం నుంచి మున్సిపల్ ఎన్నికల  ప్రతిపాదన వచ్చే అవకాశం ఉందని , రాగానే ఒకే చెప్పడమే తరువాయి ...  ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయని చెప్పారు .  రాష్ట్రం లోని  మున్సిపాలిటీలకు గత రెండు నెలల క్రితమే   ఎన్నికలు జరగాల్సి ఉండగా , ఎన్నికల నిర్వహణ పై పలువురు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ , కోర్టును ఆశ్రయించారు . దీనితో ఎన్నికల నిర్వహణ కు న్యాయస్థానం బ్రేక్ వేసింది .


వార్డుల పునర్విభజన, ఓట్ల నమోదు , తొలగింపు పై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ పలువురు పిటిషన్లను దాఖలు చేశారు. అభ్యంతరాలన్నీ విచారించిన న్యాయస్థానం , రెండు రోజుల క్రితం ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . ఆర్టీసీ సమ్మె నేపధ్యం లో జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది . అయితే పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారమే టీఆరెస్ అభ్యర్థి సైదిరెడ్డి ఘన విజయం సాధించడం తో , ఇదే ఊపులో మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కోవాలని టీఆరెస్ నాయకత్వం భావిస్తోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: