హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. ప్రతిపక్ష నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ లబ్ది కోసం విపక్షాలు అసత్య ప్రచారం చేశాయని ఆరోపించిన కేసీఆర్.. ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు.  ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ అఖండ విజయం సాధించిన తర్వాత వచ్చీరాని పార్టీలన్నీ కేసీఆర్ ని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని..సూర్యుడిపై ఉమ్మివేస్తే వారి ముఖానే పడుతుందని ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదని అన్నారు.

కేసీఆర్ ను తిడితే ఓట్లు పడతాయనుకుంటే భ్రమే అన్నారు. హుజూర్ నగర్ లో తన సభ జరక్కపోయినా  ప్రజలకు మా మీద నమ్మకంతో ఇంత గొప్ప మెజార్టీ ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు.  అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశం..ఎవరైనా ఎప్పుడైనా గెలవొచ్చు..అధికారంలోకి రావొచ్చు అన్నారు. పదవి శాశ్వతం కాదు..ప్రజలకు ఇచ్చిన మాట, హామీ శాశ్వతం అన్నారు. 


ఈ సందర్బంగా హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ గెలుపుపై ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అధికార పార్టీపై ప్రతిపక్ష నేతలు కొంత కాలంగా విషం కక్కుతున్నారని అన్నారు.   ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా ప్రజలు టీఆర్ఎస్ పక్షాన ఉన్నారని మరోసారి రుజువైందని అన్నారు. కాంగ్రెస్ కంచుకోట హుజూర్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపుపై సీఎం ఆనందం వ్యక్తం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: