మనం బయటకి వెళ్తున్నపుడు బస్సు ఒక 10 నిముషాలు లేట్ అయితేనే తట్టుకోలేం. అలాంటిది ప్రతిరోజు గంటలకొద్దీ ఎదురుచూసిన ఒక్క బస్సు రాకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. రాజకీయ నాయకులు చెప్పే ప్రతి మాట గుడ్డిగా నమ్మే జనం ఈ రోజు గళం విప్పారు. ప్రభుత్వాన్ని రోడ్డెక్కి మరీ నిలదీశారు. మీడియా,పత్రికల వాళ్ళని కడిగిపారేశారు. పబ్లికే కదా వాళ్ళే సర్దుకుపోతారు, మా కర్మ ఇంతే అని రోజులు వెళ్ళదీస్తారులే అనే ధీమాతో ప్రభుత్వం జనాల ఇబ్బందులని పట్టించుకోకుండా ఉన్న తీరుని ప్రజలు తీవ్రంగా ఖండించారు.

కొద్దిరోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించకపోవడం, ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం ప్రయాణికులకు సమస్యగా మారంది.   ఈ నేపథ్యంలో సామాన్య ప్రజానీకం బస్సుల్లేక తమ గమ్య స్థానానికి చేరుకునే మార్గం తెలియక తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు.   
ఒక్క బస్సు రాదు.. వచ్చిన బస్సులో ఇసుకేస్తే రాలనంత జనం.. ప్రైవేటు వాహనాల్లో వెళ్దామంటే డబుల్ ఛార్జీ.. ఇలా సామాన్య జనం అల్లాడుతున్నారు. బస్సు పాస్ మీద ఆధారపడి ప్రయాణించే సామాన్య జనం ఎలా ప్రయాణిస్తారు? ఒకటి కాదు రెండు కాదు రెండు వారాల నుండి ఇలాగె ఇబ్బంది పడుతున్నారు తెలంగాణ వాసులు.


 ఆఫీసులుకి, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు తీవ్ర సమస్యగా మారింది. నేడో.. రేపో.. సమస్య సమసిపోతుందిలే అనుకుంటూ జనం ఇప్పటి దాకా ఓపిక పట్టారు. కానీ, ఇప్పుడు ఆ ఓపిన నశించేస్థాయికి చేరుతోంది. ఇన్ని రోజులు సహనంతో వ్యవహరించిన జనం ఇప్పుడు అసహనంతో  రగిలిపోతున్నారు. హైదరాబాద్‌లోని మలక్‌పేట నల్లగొండ క్రాస్ రోడ్ వద్ద ఈ రోజు ఉదయం చోటుచేసుకున్న ఘటనే అందుకు నిదర్శనం. నల్గొండ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న బస్‌స్టాప్‌లో ప్రయాణికులు బస్సు కోసం గంట పాటు వేచి చూశారు. అయినా ఒక్క బస్సు రాకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయారు.ఇక లాభం లేదనుకొని.. నడి రోడ్డుపై ట్రాఫిక్‌ను నిలిపి రాస్తా రోకో నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం, ఆర్టీసీ మొండి వైఖరితో సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోపంతో ఊగిపోయారు. ఉదయం పూటే ట్రాఫిక్ భారీగా జామ్ అయ్యింది. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మలక్‌పేట్ నల్లగొండ క్రాస్ రోడ్ వద్ద ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా ప్రయాణికులు తిరగబడ్డారు. ప్రభుత్వం, ఆర్టీసీల మొండి వైఖరికి తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: