కాంగ్రెస్ పార్టీలో నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు కొత్తేమీ కాదు. పార్టీ బ‌లోపేతం క‌న్నా.. విజ‌యం క‌న్నా ఎక్కువ‌గా ఆధిప‌త్యం కోస‌మే నేత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లకు దిగుతుంటారు. ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఒక్క‌మాట‌గా ప్ర‌జ‌ల ముందుకు రారు. ఈ ప‌రిస్థితుల్లోనే పార్టీ ప్ర‌జ‌ల్లో విశ్వాసం కోల్పోతుంద‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. అయితే.. తాజాగా వెలువ‌డిన హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితాల్లో కాంగ్రెస్‌పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ కంచుకోట‌గ ఉన్న స్థానాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ కైవ‌సం చేసుకుంది.


అయితే.. ఓట‌మికి కాంగ్రెస్ పార్టీ నేత‌ల్లో ఉన్న అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు, గ్రూపులు, స‌మ‌న్వ‌య లోప‌మే ప్ర‌ధాన‌మైన కార‌ణ‌మ‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. అయితే.. హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితం త‌ర్వాత రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ మొద‌లైంది. ఎన్నిక‌ల షెడ్యూల్ కంటే ముందుగానే టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మ‌ధ్య అభిప్రాయ‌భేధాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. హుజూర్‌న‌గ‌ర్‌లో త‌న భార్య ప‌ద్మావ‌తిరెడ్డి పోటీ చేస్తుంద‌ని ఉత్త‌మ్ ప్ర‌క‌టించ‌గా.. రేవంత్‌రెడ్డి మ‌రొక‌రి పేరును ప్ర‌తిపాదించారు.


ఇది పార్టీ శ్రేణుల్లో గంద‌ర‌గోళానికి దారితీసింది. నిజానికి.. హుజూర్‌న‌గ‌ర్‌లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే.. అది ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డిపై ప‌డుతుంద‌ని, దాంతో టీపీసీసీ చీఫ్ ప‌ద‌వి కూడా ఊడిపోతుంద‌ని, అప్పుడు త‌న‌కు లైన్ క్లియ‌ర్ అవుతుంద‌న్న వ్యూహంలో భాగంగానే రేవంత్‌రెడ్డి ఇలా అభ్య‌ర్థి విష‌యంలో తిర‌కాసు పెట్టార‌నే టాక్ బ‌లంగా వినిపించింది. అందుకే రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణుల్లో, ప్ర‌జ‌ల్లో గంద‌ర‌గోళం సృష్టించార‌ని ప‌లువురు నాయ‌కులు గుస‌గుస‌లాడుకుంటున్నారు.


నిజానికి.. టీపీసీసీ చీఫ్ ప‌ద‌వి కోసం రేవంత్‌రెడ్డి బాగానే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఎక్క‌డ ఏ అవ‌కాశం వ‌చ్చినా వ‌దిలిపెట్ట‌డం లేదు. ఉత్త‌మ్ టార్గెట్‌గా ఆయ‌న ముందుకు వెళ్తున్నార‌నే టాక్ పార్టీ శ్రేణుల్లోనే వినిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లు రావ‌డం.. అభ్య‌ర్థి విష‌యంలో ఉత్త‌మ్‌తో విభేదించ‌డం తెలిసిందే. అయితే, తాజాగా వెలువ‌డిన ఫ‌లితంతో రేవంత్‌రెడ్డి టార్గెట్ పూర్తి అయింద‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది.


ఇక ఉత్త‌మ్ నేతృత్వంలో తెలంగాణ‌లో పార్టీ బ‌తికే ప‌రిస్థితి లేద‌ని, వెంట‌నే నాయ‌క‌త్వ మార్పు అవ‌స‌ర‌మ‌ని పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసే అవ‌కాశాలు కూడా ఉన్నాయ‌ని ప‌లువురు నాయ‌కులు గుస‌గుస‌లాడుకుంటున్నారు. అయితే.. ఉత్త‌మ్ విష‌యంలో పార్టీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో చూడాలి మ‌రి.


మరింత సమాచారం తెలుసుకోండి: