దేశంలో బీజేపీ రాకెట్ స్పీడ్‌తో విస్త‌రిస్తోంది. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మోడీ-షా ద్వ‌యం మ‌రింత దూకుడుగా ముందుకు వ‌స్తోంది. తాజాగా జ‌రిగిన మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ మ‌రోసారి స‌త్తాచాటింది. మ‌ళ్లీ ఈ రెండు రాష్ట్రాల్లో పాల‌నా ప‌గ్గాలు చేప‌డుతోంది. ఇక క‌మ‌లం గురి ఆ మూడు రాష్ట్రాలేన‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. ఇందులో ప్ర‌ధానంగా ప‌శ్చిమ‌బెంగాల్‌, ఢిల్లీయేన‌ని అంటున్నారు. మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానాలు ఇచ్చిన విజ‌యాల‌తో మ‌రింత ఉత్సాహంగా, మ‌రింత ప‌క‌డ్బందీ వ్యూహాల‌తో క‌మ‌ల‌ద‌ళం వ‌స్తుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.


ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఢిల్లీలో, ప‌శ్చిమ‌బెంగాల్‌లో ఎలాగైనా పాగా వేసేందుకు ప్లాన్ వేస్తుంద‌ని చెబుతున్నారు. నిజానికి.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న దేశ‌రాజ‌ధాని అయిన ఢిల్లీలో మాత్రం ఆ పార్టీ అధికారంలో లేదు. ఇక్క‌డ ఆప్ బీజేపీకి కొర‌క‌రాని కొయ్య‌గా ఉంది. ఆప్‌ను ఢీకొట్ట‌డం బీజేపీకి అంత సుల‌భం ఏమీ కాద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఢిల్లీలో ఆప్ ఎలా ఊడ్చేసిందో అంద‌రికీ తెలిసిందే. అయితే.. ప్ర‌స్తుతం ఆప్ అధినేత‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై ఇటు సొంత పార్టీ నేత‌ల్లో, అటు ప్ర‌జ‌ల్లో కొంత వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. గ‌తంలో పోల్చితే పార్టీ కూడా కొంత బ‌ల‌హీన‌ప‌డింద‌నే చెప్పొచ్చు.


అయితే.. ఢిల్లీ ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు కేజ్రీవాల్ బాగానే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే ఢిల్లీ ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకునే అప్పుడే బీజేపీ వ్యూహాలు ర‌చిస్తోంది. ఇందులో భాగంగానే బుధ‌వారం కేంద్ర కేబినెట్ స‌మావేశ‌మై సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంది. ప్ర‌ధానంగా ఢిల్లీవాసుల‌ను ఆక‌ట్టుకునే నిర్ణ‌యం తీసుకుంది. ఢిల్లీలో న‌ల‌భై ల‌క్ష‌ల ఇండ్ల ప‌ట్టాల పంపిణీకి అనుమ‌తి ఇస్తూ నిర్ణ‌యం తీసుకుంది. అంతేగాకుండా.. 1797 మురికివాడ‌ల‌కు గుర్తింపు ఇచ్చే దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇలా ఇప్ప‌టి నుంచే దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో పాగా వేసేందుకు బీజేపీ ఎత్తుగ‌డ వెస్తోంది. ఇక ప‌శ్చిమ‌బెంగాల్‌లో కూడా ఎలాగైనా పాగా వేయాల‌ని క‌మ‌ల‌ద‌ళం ఇప్ప‌టి నుంచే ప‌క‌డ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్తోంది.


ఇప్ప‌టికే అక్క‌డ అధికార‌ తృణ‌మూల్ కాంగ్రెస్, బీజేపీల మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణ‌మే నెల‌కొంది. నిత్యం ఇరు పార్టీల కార్య‌క‌ర్త‌లు, నేత‌ల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర దాడులు కొన‌సాగుతున్నాయి. అంతేగాకుండా.. టీఎంసీ అధినేత‌, ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీని ఎలాగైనా గ‌ద్దె దించాల‌ని గ‌ట్టిగానే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇదే స‌మ‌యంలో మ‌మ‌తాబెన‌ర్జీ కూడా ఎదురుదాడికి దిగుతున్నారు. అత్యంత కీల‌కమైన ఢిల్లీ, ప‌శ్చిమ‌బెంగాల్‌లో మోడీ-షా ద్వ‌యం మంత్రం ప‌నిచేస్తుందో లేదో చూడాలి మ‌రి.


మరింత సమాచారం తెలుసుకోండి: