తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మేన‌ల్లుడు హ‌రీశ్‌రావు గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి ఓటమి అన్నదే లేకుండా సిద్ధిపేట కేంద్రంగా హ‌రీశ్ గెలుపొందుతున్నారు. గ‌త ఏడాది జ‌రిగిన శాసనసభ ముంద‌స్తు ఎన్నికల్లో రాష్ట్రంలో ఎవరూ సాధించని విధంగా 1,20,650 ఓట్లతో ఎవరికీ సాధ్యంకాని గెలుపు సాధించారు. అయితే, ఆయ‌న రికార్డును మ‌రో నేత చెరిపివేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ నేత, శరద్ పవార్ బంధువు అజిత్ పవార్ బీజేపీ అభ్యర్థి గోపీచంద్ పడాల్కర్‌పై 1.65 లక్షల ఓట్ల మెజారిటీ దక్కించుకున్నారు. పోలైన ఓట్లలో దాదాపు 80 శాతం పైచిలుకు అజిత్ పవార్‌కే రావడంతో ప్రధాన ప్రత్యర్థి అయిన బీజేపీ నేత డిపాజిట్లు కోల్పోవ‌డం గ‌మ‌నార్హం.


2004 ఉపఎన్నికల్లో సిద్ధిపేట నుంచి తొలిసారి పోటీచేసిన హరీశ్‌ రావు 24,594 ఓట్లతో విజయం సాధించారు.అనంత‌రం ప్రతి ఎన్నికకూ మెజార్టీని పెంచుకుంటూ వస్తున్నారు. 2008 ఉప ఎన్నికల్లో తన మెజార్టీని రెండింతలకు పెంచుకుని 58,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2009 సాధారణ ఎన్నికల్లో 64,667, 2010 ఉప ఎన్నికల్లో 93,858, 2014 సాధారణ ఎన్నికల్లో 95,328 ఓట్ల మెజార్టీతో విజయదుందుభి మోగించారు. గ‌త ఎన్నికల్లో 1,20,650 ఓట్ల మెజార్టీతో పాటుగా రికార్డు విజయం సాధించారు.


ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ నేత అజిత్ పవార్ సైతం ఇదే రీతిలో భారీ మెజారిటీతో విజయం సాధించారు. పుణే జిల్లా బారామతి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన.. బీజేపీ అభ్యర్థి గోపీచంద్ పడాల్కర్‌పై 165265 లక్షల ఓట్ల మెజారిటీ దక్కించుకున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్‌కు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. ఉపముఖ్యమంత్రిగా పనిచేయడంతో పాటు ఆయన వివిధ శాఖలకు మంత్రిగా కూడా పనిచేశారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌పై శిఖర్‌ సహకారి బ్యాంకు అక్ర‌మాల్లో సంబంధం ఉంద‌ని పేర్కొంటూ...ఈడీ కేసు పెట్టడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అజిత్‌ పవార్ సంచ‌ల‌నం సృష్టించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: