కారు జోరు దెబ్బకు కమలం పార్టీ రేకులన్నీ ఊడిపోయాయి. రాబోయే కాలంలో తామే కెసియార్ కు అసలైన ప్రతిపక్షమని నరేంద్రమోడి నేతృత్వంలో దేశమంతా బిజెపి ఏలుబడిలోకి వచ్చేస్తోందంటూ ఏవేవో సొల్లు కబుర్లన్నీ చెప్పారు. తీరా చూస్తే ఉపఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేక చతికలపడిపోయారు. హుజూర్ నగర్ ఉపఎన్నికలో పోటి చేసిన బిజెపి అభ్యర్ధికి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు.

 

బిజెపికి సంబంధించి ఉత్తరాధి రాష్ట్రాల్లో పరిస్ధితులు వేరు ధక్షిణాది రాష్ట్రాల్లో వ్యవహారం వేరు. మొదటినుండి కూడా కమలం పార్టీకి ఉత్తరాధి రాష్ట్రాల పార్టీగానే ముద్రపడింది. కాకపోతే ధక్షిణాది రాష్ట్రాల్లో అప్పుడప్పుడు మెరుపులు మెరిపిస్తుంటుందంతే. కర్నాటక రాష్ట్రంలో అధికారంలోకి మెరుపులాగే వచ్చింది.

 

ఇక సమైక్య రాష్ట్రంలో కానీ లేకపోతే విడిపోయిన తర్వాత కూడా కానీండి బిజెపికి బేస్ అన్నదే లేదసలు. ఎవరో ఇద్దరు, ముగ్గుర నేతలున్నారంతే. జాతీయస్ధాయిలో బలమైన గాలి వీస్తే మాత్రం రెండు రాష్ట్రాల్లోను ఓ నాలుగు సీట్లు వస్తే రావచ్చంతే. అదికూడా బలమైన గాలి వీస్తేనే సుమా.  మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ నాలుగు ఎంపి సీట్లు గెలుచుకున్నదంటే కేవలం నరేంద్రమోడి గాలివల్లే అన్న విషయం గ్రహించాలి.

 

కానీ బిజెపి నేతలు మాత్రం తమ పార్టీ తెలంగాణాలో బలపడిందని, వచ్చే ఎన్నికల్లో కెసియార్ ను ఓడించి అధికారంలోకి వచ్చేయబోతున్నట్లు కతలు చెప్పేస్తున్నారు.  తాజాగా హుజూర్ నగర్ ఉపఎన్నిక  విషయమే తీసుకుంటే 2.07 లక్షల ఓట్లు పోలయితే కమలం పార్టీకి వచ్చింది 2621 ఓట్లు. అంటే డిపాజిట్ కూడా దక్కలేదన్న విషయం అర్ధమైపోయింది.

 

ఇపుడు అభ్యర్ధికి వచ్చిన ఓట్లే బిజెపి అసలైన ఓట్లన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలి. ఏదో అదృష్టం కొద్ది గెలిచిన 4 సీట్లను చూసుకుని ఎగిరెగిరి పడితే విరిగేది తమ కాళ్ళే అన్న విషయాన్ని నేతల గ్రహించాలి. కాబట్టి ఇపుడు వచ్చిన ఓట్లను దృష్టిలో పెట్టుకునే వచ్చే ఎన్నికల్లో బలపడేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగితేనే బిజెపికి ఏమైనా ఉపయోగముంటుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: