రికార్డు స్థాయి మెజార్టీతో...హుజూర్‌నగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ పార్టీ విజయం సాధించడం గులాబీ శ్రేణుల‌కు రెట్టించిన ఉత్సాహాన్ని అందించిన సంగ‌తి తెలిసిందే. హుజూర్ నగర్లో భారీ విజయం అనంత‌రం తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధినేత‌ కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న బీజేపీపై విరుచుకుప‌డ్డారు. హుజూర్ నగర్లో బీజేపీకి డిపాజిట్లు గల్లంతయిన విష‌యాన్ని ప్ర‌స్త‌విస్తూ..బీజేపీ పెట్టిన పెడబొబ్బలకి వచ్చిన ఓట్లకు ఏడవాలో, నవ్వాలో వాళ్ళకే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. 


బీజేపీ ఎలాగైనా గెలవాలని హుజూర్ నగర్లో పోటీ చేసిందని చెప్పిన కేసీఆర్ అక్క‌డ డిపాజిట్ కూడా ద‌క్కించుకోలేక‌పోయార‌ని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు తమపై అపవాదులు వేసి గొప్పవాళ్ళు అవుదామని అనుకున్నారని, అహంకారం, అహంభావం పనికిరాదని అన్నారు. ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని, పని చేసే ప్రభుత్వానికి ఇదో టానిక్ లాంటిదని అన్నారు కేసీఆర్. తాము మరింత ఉత్సాహంతో పని చేసేందుకు ప్రజలు తమని బలపరిచారని చెప్పారు. ప్రతిపక్షాలు తమపై ఇటీవల చాలా నిందలు వేశారని, అయినా గత ఎన్నికల్లో 7 వేల తేడాతో ఓడిపోయిన ఆ సీటును ఇప్పుడు ప్రజలు 43 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారని చెప్పారు. ఇది టీఆర్ఎస్ 50 వేల మెజారిటీ సాధించినట్లు లెక్కఅని అన్నారు. 


త‌మ‌కు గొప్ప విజ‌యం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్న‌ట్లు కేసీఆర్ వెల్ల‌డించారు.  వాతావరణం అనుకూలించకపోవ‌డంతో తాను హుజూర్‌న‌గర్ వెళ్ల‌లేక‌పోయాన‌ని...అయినా ప్రజలు తమను ఆదరించారని, హుజూర్ నగర్ వెళ్లి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తామని అన్నారు.  హుజూర్ నగర్ లో సాగునీటి సమస్య ఉందని, ‘సాగర్ ఆయకట్లు రైతుల ఇబ్బందుల్ని పరిష్కరిస్తామని చెప్పారు కేసీఆర్. ప్రజల ఆశలు నెరవేరుస్తామని అన్నారు. ఎన్నిక ప్రచార సమయంలో వర్షం వల్ల తన సభ రద్దవడంతో హుజూర్ నగర్ రాలేకపోయానని చెప్పారాయన. శ‌నివారం నేరుగా హుజూర్ నగర్ వచ్చి ప్రజలకు థ్యాంక్స్ చెబుతానని అన్నారు అక్కడికక్కడే ప్రజల ఆశయాల మేరకు ప్రకటన చేస్తానని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: