లక్ష పైచిలుకు ఓట్లు.. 43వేలకు పైగా మెజారిటీ. ఇదీ హుజూర్‌నగర్‌లో ఏడాది తిరగకుండా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి సాధించిన విజయం. సామాజిక కార్యకర్తగా.. రాజకీయనేతగా మొదలైన సైదిరెడ్డి ప్రస్థానం నేడు ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యేలా చేసింది. 


సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుండ్లపల్లికి చెందిన సైదిరెడ్డి.. వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి. 2000లో ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం రావడంతో జమైకా వెళ్లారు. తన నాయకత్వ లక్షణాలు, సేవాభావంతో అనేక కార్యక్రమాలు చేపట్టి ఐక్య రాజ్య సమితి పెద్దల ప్రశంసలు అందుకున్నారు సైదిరెడ్డి. 2005లో కెనడా వాంకోవర్‌కు వెళ్లారు. అక్కడ వ్యాపార కార్యకలాపాలు చూసుకుంటూనే కేసీఆర్‌ సారథ్యంలో సాగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా కెనడాలోనూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. 


తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సొంత ప్రాంతానికి చేరుకుని ఇక్కడి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చారు సైదిరెడ్డి. యువతకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చారు. తండ్రి అంకిరెడ్డి పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో 2017లో హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్‌ బలోపేతానికి బాధ్యతలు తీసుకున్నారు సైదిరెడ్డి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నుంచి పోటీ చేసినా.. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చేతిలో స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. 


అయినప్పటికీ  నియోజకవర్గానికే అంటిపెట్టుకుని అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇచ్చారు. సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పెద్ద సంఖ్యలో సీట్లు గెలుచుకునేలా చేశారు. ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుని బంపర్‌ మెజారిటీతో విజయం సాధించారు సైదిరెడ్డి. సైదిరెడ్డి విజయంపై టీఆర్ఎస్ అధిష్టానం హర్షం వ్యక్తం చేస్తోంది. ఆయనపై ఉంచిన నమ్మకం వృథాగా పోలేదని భావిస్తోంది. అటు కేసీఆర్ సైతం సైదిరెడ్డి గెలుపుపై ఆనందం వ్యక్తం చేశారు. తాను హుజూర్ నగర్ సభకు హాజరుకాలేకపోయినా.. విజయం వరించందని సంబరపడ్డారు. త్వరలోనే హుజూర్ నగర్ కు వెళ్లి ప్రజలతో ముచ్చటిస్తానని చెప్పుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: