బీజేపీ నేతలకు షాకిచ్చారు హర్యానా ఓటర్లు. అక్కడ హంగ్ తీర్పిచ్చారు. అనూహ్యంగా ఇక్కడ జననాయక్‌ జనతాపార్టీ నేత దుష్యంత్‌ చౌతలా కింగ్‌ మేకర్‌ అయ్యారు. కమలనాథులకు రెండోసారి పీఠం దక్కకూడదని  భావిస్తున్న కాంగ్రెస్‌..దుష్యంత్‌కు సీఎం పదవి ఆఫర్‌ చేసింది. 


ఏం జరిగింది? ఓటర్లు ఎందుకిలా తీర్పిచ్చారు? ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌ షా సభలకు జనం భారీగా వచ్చినా.. ఎక్కడ తేడా కొట్టింది? మిషన్‌ 70ప్లస్‌ ఎందుకు బొక్కబోర్లా పడింది? హర్యానా ఫలితాలను చూసిన తర్వాత బీజేపీ నేతలు వేసుకుంటున్న ప్రశ్నలివే. కేంద్రంలో అధికారంలో ఉన్నా.. ఢిల్లీకి ఆనుకుని ఉండే హర్యానాలో ఇలాంటి ఫలితాలను ఊహించలేదు మోడీ అండ్‌ కో. గత ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 46 స్థానాలకంటే  ఒక్క సీటు ఎక్కువ సాధించి.. అంటే 47 సీట్లతో అధికారం చేపట్టింది బీజేపీ. ఇప్పుడా మార్కును కూడా అందుకోలేదు కమలనాథులు. 


ఆర్టికల్‌ 370 రద్దు, పాక్‌తో వైరం తప్పకుండా లాభిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు బీజేపీ నాయకులు. చివరకు పాక్‌కు గండికొట్టి ఆ దేశానికి వెళ్లే నీటిని హర్యానాకు తీసుకొచ్చి తాగు, సాగు కష్టాలు తీరుస్తామని ప్రధాని మోడీ స్వయంగా హామీ ఇచ్చినా.. అవేమీ జనాలను ఆకర్షించలేదని చెబుతున్నాయి ఫలితాలు. ఎన్నికలకు ముందు హర్యానా కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు ఒక రేంజ్‌లో ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 5 నుంచి 12 సీట్లు రావడమే కష్టమని స్వయంగా మాజీ సీఎం భూపేందర్‌ సింగ్‌ హుడా పార్లమెంట్‌ ఆవరణలో అహ్మద్‌పటేల్‌కు చెప్పడం మీడియాలో ప్రముఖంగా వచ్చింది. హర్యానా పీసీసీ మాజీ చీఫ్‌ సైతం టెన్‌జన్‌పథ్‌ ఎదుట రోడ్డుపై ధర్నా చేశారు. ఇన్ని ప్రతికూలతలున్నా..హస్తం అనూహ్యంగా  పుంజుకోవడం విశేషం. బహుశా కాంగ్రెస్‌ నేతలు కూడా ఈ స్థాయిలో ఫలితాలు వస్తాయని ఊహించి ఉండరు. 


ఇక ఐ.ఎన్.ఎల్.డి నుంచి వేరుపడిన దుష్యంత్‌ చౌతాలా సొంత కుంపటి పెట్టుకుని సత్తా చాటాడు. ప్రభుత్వ ఏర్పాటులో దుష్యంత్‌ కీలకంగా మారారు. జేజేపీని బీజేపీ ఎగరేసుకుని పోకుండా కాంగ్రెస్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. దుష్యంత్‌ చౌతాలాను సీఎంను చేస్తామని.. మరోసారి కర్ణాటక ఫార్ములాకు తెరతీసింది. అదే జరిగితే దుష్యంత్‌ మరో కుమారస్వామి అవుతారు. ఏది ఏమైనా 90 అసెంబ్లీ సీట్లున్న హర్యానాలో ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. దీంతో మరికొన్ని రోజులు హర్యానాలో రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: