జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో సీఎం వైయస్‌ జగన్‌పై హత్యాప్రయత్నం చేస్తే దాన్ని చంద్రబాబు వెకిలిగా కోడికత్తి కేసు అంటే.. దాన్నిపట్టుకొని పవన్‌ మాట్లాడుతున్నారని విమర్శించారు. వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగింది వాస్తవం. చంద్రబాబు డీఎన్‌ఏ, పవన్‌ డీఎన్‌ఏ ఒకటే అనుకునేట్లుగా ఇద్దరూ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి రాంబాబు.


వైయస్‌ వివేకానందరెడ్డి హత్య టీడీపీ హయాంలో జరిగింది. సీబీఐ ఎంక్వైరీ వేయాలని గతంలో వైయస్‌ఆర్‌ సీపీ డిమాండ్‌ చేసింది. సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో పోలీసు వ్యవస్థ సక్రమంగా నడుస్తోంది. ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ వేస్తే పోలీసులపై నమ్మకం లేదా అని వారే మాట్లాడుతారని అంబటి రాంబాబు విమర్శించారు.


అంబటి ఇంకా ఏమన్నారంటే..” పవన్‌ కల్యాణ్‌ సొంతంగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ప్రకాశం జిల్లా వలసలను ఆపాలని పవన్‌ మాట్లాడుతున్నాడు.. అది పక్కనపెట్టి జనసేన నుంచి వెళ్లే వలసలను ఆపేందుకు ప్రయత్నిస్తే మంచిది. సీఎం వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడే నైతిక అర్హత పవన్‌కు లేదు. వైయస్‌ జగన్‌ ఓటమి ఎరుగని ధీరుడు. పవన్‌కు గెలుపు అంటే తెలీదు. రెండు చోట్ల పోటీచేసినా.. ఒక్క చోట కూడా గెలవలేదు. పవన్‌పై ప్రజలకు ఉన్న నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోండి. 151 సీట్లు గెలిపించి వైయస్‌ జగన్‌ను ప్రజలు ముఖ్యమంత్రిని చేశారు.


పవన్‌ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం సరికాదు... సీఎం వైయస్‌ జగన్‌ ధైర్యం గురించి పవన్‌ దగ్గర సర్టిఫికెట్లు తీసుకోవాల్సిన కర్మ మాకు లేదు. వైయస్‌ జగన్‌ ధైర్యసాహసాలు ప్రదర్శించబట్టే వైయస్‌ఆర్‌ సీపీ నిలబడింది. పార్టీని స్థాపించి ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను పదవులకు రాజీనామాలు చేయించి గెలిపించుకొని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని పటిష్టం చేశారు అని ఎమ్మెల్యే అంబటి రాంబాబు సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: