మోడీ అంటే చాలు బీజేపీకి పూనకం వస్తుంది. ఆయన ఒక్కడుంటే చాలు విజయాలు అలా వచ్చి ఒళ్ళో వాలిపోతాయి. రాజకీయ  గండరగండడు మోడీ అంటారు. ఆయనకు ఎదురులేదు, తిరుగులేదు, ఇవన్నీ బిరుదులే. గుజరాత్ నుంచి ఒక్కసారిగా ఢిల్లీ వచ్చిపడిన మోడీ తనతో పాటు బీజేపీ జాతకం మార్చేశారు. ఎంతలా అంటే తానే బీజేపీ అనేంతగా.


ఇపుడు అదే పాపమై, శాపమై కూర్చుంది. వ్యవస్థగా ఉన్న బీజేపీని వ్యక్తి పార్టీగా చేయడంలో మోడీ సక్సెస్ అయ్యారు. తన ఇమేజ్ ని పెంచుకుని పార్టీతో పంచుకున్నారు. పార్టీ తాను వేరు కామని చెప్పుకున్నారు, ఒప్పించారు. కానీ ఇపుడు అదే మోడీ ఇమేజ్ నీటి బుడగగా మారిపోయింది. దాంతో ఇపుడు బీజేపీ గతేంటన్నది పెద్ద ప్రశ్నగా  ఉంది.


తాజాగా రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలిచిందా ఓడిందా అంటే కచ్చితంగా ఓండిందనే చెప్పాలి. ఎందుకంటే మహారాష్ట్రలో 2014 ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన సీట్లు 122 అయితే ఈసారి 102 అయ్యాయి. అంటే 20 సీట్లు అక్కడ పోగోట్టుకుంది. ఇక హర్యానాలో చూసుకుంటే అయిదు నెలల క్రితమే ఎంపీ సీట్లు పదికి పది బీజేపీ గెలుచుకుంది. అంతే కాదు, 2014 ఎన్నికల్లో 47 సీట్లు సాధించి సర్కార్ ని ఏర్పాటు చేసింది. ఇపుడు ఆ సీట్లు 40 కి తగ్గాయి.


బీహార్లో ఉప ఎన్నికలు జరిగితే పోటీ చేసిన రెండు సీట్లు పోగొట్టుకుంది. అదే విధంగా మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఆరింటికి ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ నాలుగు గెలిచింది, మోడీ పార్టీ బీజేపీ 2 సీట్లే దక్కించుకుంది. ఇక తెలంగాణాపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే హుజూర్ నగర్ లో డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. మరి మోడీ హవా ఎక్కడ ఉంది. అధికారంలోకి వచ్చిన అయిదు నెలల్లోనే ఇలా జరిగితే రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటి. ఇపుడు ఇదే కమలనాధులను వేధిస్తున్న ప్రశ్న.


మరింత సమాచారం తెలుసుకోండి: