పవన్ రాజకీయాల్లొకి వస్తూ చెప్పిందేంటి. ఇపుడు చేస్తున్నదేంటి. ఇది తటస్థంగా ఉంటూ రాజకీయాలను గమనించే వారిని వేధిస్తున్న ప్రశ్న. పవన్ రాజకీయాల్లో మధ్యతరగతి  వర్గానికి ప్రతినిధి అనుకున్నారు. మేధావులకు గొంతు అని కూడా భావించారు. అట్టడుగు రాజకీయానికి కేరాఫ్ అడ్రస్ అని కూడా వూహించారు. కానీ పవన్ గత కొంతకాలంగా చేస్తున్న కామెంట్స్ చూస్తూంటే ఆయన రూటే సెపరేట్ అనిపించక మానదేమో.


జగన్ మీద పవన్ చాలా దారుణమైన విమర్శలు చేస్తున్నారు. అలా ఇలా కాదు, కక్షతో చేస్తున్నట్లుగా పవన్ మాట్లాడుతున్నారు. ఒక నేరస్థుడు ముఖ్యమంత్రి అయితే ఇంతే అంటూ పవన్ వాడిన భాష ఇపుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. జగన్ కి ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇవ్వలేదని పచ్చ పత్రికల్లో వచ్చిన రాతలను ఆధారం చేసుకుని పవన్ బాబు కంటే దూకుడుగా మాటలు వాడేశారు. నిజానిజాలు నిర్ధారించుకోకుండా పవన్ కేవలం జగన్ని కార్నర్ చేయడానికే విమర్శలు చేసినట్లుగా ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ ఢిల్లీ టూర్ గురిని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రెస్ రిలీజ్ చేసింది. అందులో ఆయన అమిత్ షాతో భేటీ అయి ఏం మాట్లాడారో స్పష్టంగా ఉంది. దాన్ని వదిలేసి వూహాగానాలు పట్టుకుని పవన్ చేస్తున్న విమర్శలు చూస్తే ఆయనేనా కొత్త రాజకీయం అని చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చింది అనిపించకమానదు.


దీని మీద వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబారుబు సీరియస్ అయ్యారు. పవన్ బరితెగించారంటూ అంబటి గట్టిగా తగులుకున్నారు. నేరస్థుడు అంటూ జగన్ని ఎలా అంటారని కూడా ఆయన ప్రశ్నించారు.  నేరం రుజువు కానంతవరకూ ఎవరైనా నిందితులేనని, ఈ విషయం వేల పుస్తకాలు  చదివానని అంటున్న పవన్ కి అర్ధం కాలేదా అంటూ కడిగిపారేశారు. పవన్ చంద్రబాబుకు దత్తపుత్రుడు అంటూ గట్టిగానే కౌంటర్లేశారు.


అవన్నీ సరే కానీ పవన్ ఇలా జగన్ మీద దాడి వ్యక్తిగతంగా చేయడం పట్ల పలు రకాలుగా చర్చ సాగుతోంది. పవన్ అసహనంతో ఈ రకంగా మాట్లాడుతున్నారా అన్నది కూడా వినిపిస్తోంది. ఏమైనా పాతికేళ్ల పాటు రాజకీయం అని చెప్పుకునే పవన్ ఒక్క ఎన్నికకే ఇలా అసహనంతో మాట్లాడితే ముందుకు అడుగులు ఎలా పడతాయి అన్నది పెద్ద ప్రశ్న. మరి పవన్ ఇకనైనా హుందా రాజకీయాలు చేస్తే ఆయనకే మేలు అంటున్నారు వైసీపీ నేతలు.


మరింత సమాచారం తెలుసుకోండి: