టాలీవుడ్ కమెడియన్ బండ్ల గణేష్ ను రెండు రోజుల క్రితం బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం ప్రముఖ నిర్మాత పీవీపీ బండ్ల గణేష్ తనను బెదిరించాడని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నోటీసులు తీసుకోవటానికి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన బండ్ల గణేష్ ను మరో కేసులో బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రొద్దుటూరుకు చెందిన వ్యాపారి మహేశ్ బండ్ల గణేష్ ఇచ్చిన 10 లక్షల రూపాయల చెక్ బౌన్స్ కావటంతో నాలుగు సంవత్సరాల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
ఈ కేసులో కోర్టు బండ్ల గణేష్ కు గతంలో సమన్లు జారీ చేసింది. కానీ బండ్ల గణేష్ కోర్టుకు హాజరు కాకపోవటంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కోర్టు వారెంట్ జారీ చేయటంతో బంజారాహిల్స్ పోలీసులు బండ్ల గణేష్ ను అరెస్ట్ చేసి కడప న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. కడప న్యాయస్థానం బండ్ల గణేష్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. కానీ ఆ తరువాత బండ్ల గణేష్ కడప వ్యాపారి మహేశ్ తో రాజీ ప్రయత్నాలు చేశారు. 
 
బండ్ల గణేష్ వ్యాపారి మహేశ్ కు కోర్టు ఆవరణలోనే 4 లక్షల రూపాయలు చెల్లించగా నవంబర్ నెల 14వ తేదీలోపు మిగతా డబ్బు చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నాడు. మహేశ్ తరపు లాయర్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవటంతో కోర్టు బండ్ల గణేష్ కు బెయిల్ మంజూరు చేసింది. ఒకప్పుడు స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు నిర్మించిన బండ్ల గణేష్ టెంపర్ సినిమా తరువాత మరే సినిమా నిర్మించలేదు. 
 
గత కొన్ని సంవత్సరాలుగా కమెడియన్ గా సినిమాలకు దూరమైన బండ్ల గణేష్ మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో కమెడియన్ గా రీఎంట్రీ ఇస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమాలో బండ్ల గణేష్ కోసం అద్భుతమైన పాత్ర సృష్టించాడని తెలుస్తోంది. సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం బండ్ల గణేష్ రోజుకు 5,00,000 రూపాయల చొప్పున పారితోషికం తీసుకున్నాడని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: