’అమరావతిలో రాజధాని నిర్మాణానికి ప్రతిపక్షంలో ఉన్నపుడు మద్దతిచ్చిన జగన్ ఇపుడు మరో కమిటి వేయటమేంటి’ ?...ఇది ట్విట్టర్ వేదికగా చంద్రబాబు తాజా మండిపాటు. అవును, ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబునాయుడు చేసిన నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. అయితే తన చేతకాని తనం వల్ల ఇచ్చిన మద్దతును చంద్రబాబు ఉపయోగించుకోలేకపోయారు. తాజాగా ట్విట్టర్లో తన చేతకాని తనాన్ని చంద్రబాబే బయటపెట్టుకున్నారు.

 

రాజధానిగా అమరావతిని నిర్మిస్తున్నట్లు చంద్రబాబు ఓ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అప్పుడు జగన్ ఆ తీర్మానానికి మద్దతు తెలిపింది వాస్తవమే. సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి విషయంలో జరిగిన పొరపాటును అమరావతి విషయంలో పునరావృతం చేయొద్దని కూడా జగన్ సూచించారు.  శివరామకృష్ణన్ అమరావతిని రాజధానిగా వద్దని చెప్పినా జగన్ మాత్రం అమరావతికి మద్దతు ఎందుకిచ్చారు ?

 

ఎందుకిచ్చారంటే రాజధానిగా అమరావతి వద్దని జగన్ చెప్పినా చంద్రబాబు వినేస్ధితిలో లేరు కాబట్టి. అసెంబ్లీలో మెజారిటి కారణంగా తాను అనుకున్నదాన్నే చంద్రబాబు చేసుకునెళ్ళాలని అప్పటికే నిర్ణయించుకున్నారు. కాబట్టి తాను అడ్డుపడినా ఎటువంటి ఉపయోగం ఉండదని జగన్ కు అర్ధమైపోయింది. అందుకనే కొన్ని సూచనలు చేసి రాజధాని నిర్మాణానికి జగన్ మద్దతిచ్చారు.

 

అయితే వాస్తవంలో జరిగిందేమిటి ? ఏమిటంటే రాజధాని నిర్మాణంలో జగన్ ఇచ్చిన మద్దతును చంద్రబాబు ఉపయోగించుకోలేకపోయారు. అమరావతి పేరుతో జనాలను భ్రమల్లో ముంచేశారు. ప్రపంచస్ధాయి రాజధాని అంటూ ఒకటే ఊదరగొట్టి జనాలను మోసం చేశారు.

 

శివరామకృష్ణన్ కమిటి ముందు కూడా జనాలు అమరావతినే రాజధానిగా అంగీకరించారని చంద్రబాబు చెప్పింది పూర్తిగా అబద్ధమే. ఉత్తరాధి వాళ్ళు విశాఖపట్నాన్ని రాజధానిగా చేయమన్నారు. రాయలసీమ జిల్లాల వాళ్ళు కర్నూలులోను, తిరుపతినే రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు. సరే ఎవరి డిమాండ్లు ఎలాగున్నా రాజధాని నిర్మించే విషయంలో వచ్చిన అవకాశాన్ని చంద్రబాబు చెడగొట్టుకున్నారు. అందుకే అప్పుడు చంద్రబాబు చేయలేకపోయిన పనిని ఇపుడు జగన్ చేసి చూపిద్దామనుకుంటున్నారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: