హూజూర్‌న‌గ‌ర్‌లో ఉప ఎన్నికలో పరాభవం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి గట్టి దెబ్బ కొట్టేలానే కన్పిస్తోంది.  పీసీసీ చీఫ్  మార్పు అంశంపై పార్టీలో జోరుగా చ‌ర్చ  సాగుతున్నన ప్రస్తుత తరుణంలో  హూజూర్‌న‌గ‌ర్ ఓట‌మితో ఈ మార్పు త‌ప్ప‌నిస‌రి అంటూ కాంగ్రెస్ లోని మరోవర్గం ప్రచారాన్ని ప్రారంభించింది.  ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నేత‌లంతా క‌లిసి ఉన్న‌ట్లు బ‌య‌ట ప్ర‌చారం జరిగినా.. లోప‌ల మాత్రం ఓడిపోవాల‌న్న భావ‌న‌తోనే ఉన్నార‌నే పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు.


 అధిష్టానానికి హూజూర్‌న‌గ‌ర్ గెలిపించుకుంటాన‌నే భ‌రోసా ఇచ్చి నల్గొండ ఎంపీగా బరిలో దిగి విజ‌యం సాధించారు. ఇక ఎమ్మెల్యే స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో కూడా తన భార్యను గెలిపించుకుంటాననే ధీమా వ్యక్తం చేసినప్పటికీ ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు.  దీన్ని  పార్టీ హైక‌మాండ్ సీరియ‌స్‌గా తీసుకునే అవ‌కాశ‌ముంది. ఈ  ఓట‌మితో ఉత్త‌మ్ సెల్ఫ్‌గోల్ చేసుకున్నార‌ని పార్టీలోని మరోవర్గం భావిస్తున్నట్లు సమాచారం.


 తెలంగాణ అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో టికెట్ల కేటాయింపులో ఉత్తమ్ వ్యవహరించిన తీరుపై పార్టీలో చాలామంది ఆగ్రహంతో ఉండగా..  పలువురు తమ రాజ‌కీయ భ‌విష్య‌త్ ను కూడా దెబ్బ‌కొట్టార‌ని ఆరోపణలు చేశారు.  పీసీసీ చీఫ్ గా ఉన్నప్పటికీ  ఎమ్మెల్యేల పార్టీ మార్పులను ఆప‌లేక‌పోయార‌ని కాంగ్రెస్ స‌భాప‌క్ష నేత భట్టి విక్ర‌మార్క కూడా పలుమార్లు విమర్శించారు. 


ఇక పార్టీలో కొత్త‌గా చేరిన రేవంత్ రెడ్డి ఎప్పుడెప్పుడు పీసీసీ ప‌గ్గాలు అందిస్తారోన‌ని ఆశ‌గా ఉన్నారు. మరోవైపు నల్గొండలో మరో కీలక నేతగా ఉన్న కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి  పార్టీ హైకమాండ్ వద్ద పీసీసీ చీఫ్ పదవికి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక వీరితో పాటు సంపత్, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు వంటి మరికొందరు సీనియర్ నేతలు చీఫ్ పదవి కోసం లాబీయింగ్ మొదలుపెట్టారని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: