హూజూర్ నగర్  ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం మంచి టానిక్ లా పనిచేస్తోందని  సీఎం కేసీఆర్ వెల్లడించారు.  హుజుర్‌నగర్ ప్రజల తీర్పుతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు కల్పించిన అపోహాలు,  చేసిన రాద్ధాంతాలు తప్పేనని తెలిపోయిందన్నారు.  ఇప్పటికైనా ప్రతిపక్ష నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం మానుకోవాలని కేసీఆర్ సూచించారు.  


ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేసే సమయంలో ఏ విషయంపై విమర్శలు చేస్తున్నామో తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఆర్టీసీ సమ్మె విషయంలో విరుద్ధమైన ప్రకటనలు చేసిన బీజేపీకి అక్కడ డిపాజిట్ కూడా దక్కలేదని కేసీఆర్ ఎద్దేవా చేశారు.  కేసీఆర్‌ను తిడితే పెద్దవాళ్లు కాలేరన్న కేసీఆర్  విమర్శలు హుందాగా, విమర్శనాత్మకంగా ఉండాలని సూచించారు.  అహంకారం లేకుండా వ్యవహరించాలి. బాధ్యతగా ప్రవర్తిస్తే రేపు మీరు కూడా అధికారంలోకి వస్తారని ఆయన ప్రతిపక్షాలకు చురకలంటించారు. ఈ విజయంతో  మరింత బాధ్యతతో, సంస్కారవంతంగా పనిచేయాలని పార్టీ నేతలను కోరుతున్నానని సీఎం వెల్లడించారు.  రాష్ట్రాన్ని గాడినపెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని కేసీఆర్ ప్రకటించారు.


 అటు ఈ ఎన్నికల్లో గెలుపొందిన సైదిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్..  త్వరలోనే హూజూర్ నగర్ ప్రజలను కలుస్తునానని పేర్కొన్నారు. ఈ ఎన్నికల ఫలితాలతో తమకు ప్రజల నుంచి మద్దతు స్పష్టంగా ఉందని అర్థమవుతోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. దీంతో పాటు వీలైనంత త్వరగా మున్సిపల్‌ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేసీఆర్ వెల్లడించారు. 

నియమిత విధానంలో గ్రామాలు, పట్టణాలు అభివృద్ది జరిగేలా గ్రామ పంచాయతీ, మున్సిపల్‌ చట్టాలు రూపొందించామన్న ఆయన  పంచాయతీలకు ప్రతి నెలా రూ. 330 కోట్లు కేటాయించి పల్లె ప్రగతి ద్వారా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నాం. మరో రూ. 1,030 కోట్లు కేటాయించి మొత్తం రూ. 2,060 కోట్లతో 141 మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మున్సిపాలిటీ ఎన్నికలు అనుకున్న దానికంటే రెండు నెలలు ఆలస్యమయ్యాయన్న సీఎం.. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పుతో మున్సిపల్‌ ఎన్నికలపై 99 శాతం స్పష్టత వచ్చిందని వెల్లడించారు. మరో నాలుగైదు రోజుల్లో ఈ అంశాలపై పూర్తి స్పష్టత వస్తుందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: