``ఏపీ సీఎం జగన్ ఆర్టీసీ విలీనంపై కమిటీనే వేశారు...ఐదారునెలల్లో చెప్తామన్నారు... ఆ తర్వాత ఏమవుతుందో దేవుడికే ఎరుక`` అని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ ఆర్టీసీ గురించి వ్యాఖ్యానిస్తూ...ఆయ‌నీ కామెంట్లు చేశారు. ఇదే స‌మ‌యంలో...ఏపీ స‌ర్కారు కీల‌క ప్ర‌క‌ట‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఆర్టీసీ విలీనంలో ఏపీ సర్కారు మరో ముందడుగు వేసింది. విలీన ప్రక్రియను 3 నుం చి 4 నెలల్లో పూర్తి చేసేందుకు ఏడుగురు సభ్యులతో వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.


విలేక‌రుల స‌మావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..ఆర్టీసీని విలీనం చేయడం అంత ఈజీనా? అని ప్రశ్నించారు. ఆర్టీసీ విలీనం అనే అసంబద్ధ, అర్థరహిత, తెలివితక్కువ నినాదం పట్టుకుని, పనికిమాలిన రాజకీయ నాయకులు, తలకాయ మాసిపోయినోడు.. వీళ్లా.. మాట్లాడేది? అని మండిపడ్డారు. ``ఆర్టీసీని కలిపినప్పుడు మిగిలిన కార్పొరేషన్లను ఎందుకు విలీనం చేయ‌ర‌ని కోర్టులు ప్రశ్నిస్తే ఏం చెప్పాలే? మిగిలిన 57 కార్పొరేషన్లు మమ్మల్ని కూడా ప్రభుత్వంలో కలపాలని దరఖాస్తు పెడితే ఏం చేయాలె? `` అని నిలదీశారు. ప్రస్తుతం చాలా రాష్ర్టాలు ఆర్టీసీని తీసేశాయని, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లో ఆర్టీసీ లేనేలేదని చెప్పారు. సీపీఎం 35 ఏండ్లపాటు పశ్చి మబెంగాల్‌ను పాలించి ఆర్టీసీని మూసేసిందని తెలిపారు. బీహార్‌లో అతి తక్కువసంఖ్యలో ఉన్నాయని, అవీ అద్దెబస్సులేనని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో ఆర్టీసీని మూసింది కాంగ్రెస్ సీఎం దిగ్విజయ్ కాదా? బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు విలీనం చేయడంలేదు? అని ప్రశ్నించారు.


కాగా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఆర్టీసీపై కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  ఏడుగురు సభ్యులతో వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయ‌గా..ఈ గ్రూప్‌లో ఆర్థిక, రవాణా, జీఏడీ, న్యాయశాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులను నియమించింది. నవంబర్ 15 లోపు రిపోర్ట్ ఇవ్వా లని సూచించింది. ఆర్టీసీ విలీన ప్రక్రియలో కీలకమైన ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపు, ఆర్టీసీ రుణాలు, ఆస్తులను కమర్షియల్ తరహాలో వినియోగంపై ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వనుంది. రవాణా శాఖలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ఏర్పాటు, ఉద్యోగుల హోదాలు, పోస్టులు, జీతాలు, పే స్కేల్ విధి విధానాలపై ప్రతిపాదనలు రూపొందించనుంది. నిపుణుల కమిటీ నివేదికకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చాక సీఎం జగన్ పరిశీలనకు చేరుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: