కర్ణాటకలో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో వరద పోటెత్తుతోంది. దీంతో వరద నీటిని కృష్ణా నదిలోకి చేరుతోంది. ఎగువన ఉన్న ఆల్మట్టి నుంచి వరద నీరు వస్తూండటంతో కృష్ణాలో వరద పెరుగుతోంది. దీంతో శ్రీశైలం నుంచి వస్తున్న వరదతో నాగార్జున సాగర్ నీటితో కళకళలాడుతోంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ లో వరద నీరు 5 లక్షల క్యూసెక్కులకు పైగానే కొనసాగుతోంది.

 

 

రాత్రి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు క్రస్ట్ గేట్ల ద్వారా విడుదల చేస్తున్న నీటి పరిమాణాన్ని అధికారులు పెంచారు. నిన్నటివరకూ 12 గేట్లను 15 అడుగుల ఎత్తు వరకూ ఎత్తిన అధికారులు ఈరోజు 18 గేట్లను 20 అడుగుల మేరకు తెరిచారు. ప్రస్తుతం సాగర్ లో ఇన్ ఫ్లో 5.41 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 101 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.30 అడుగుల మేరకు నీరు నిల్వ ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, 309 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుతానికి వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్న అధికారులు వరద నీటి ప్రవాహాన్ని అంచనా వేస్తూ ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారు. మరో వైపు వరద నీటి ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు అప్రమత్తం అయ్యారు. రైతులు, మత్స్యకారులను హెచ్చరిస్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వరద ప్రభావం చూపే అవకాశం ఉండటంతో

 

 

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరికొన్ని రోజులు వరద వచ్చే అవకాశం ఉందని అధికారులకు సమచారం వస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఎన్డీఆర్ఎఫ్ బలగాలను సిద్ధం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: