తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కేసీఆర్‌, జ‌గ‌న‌ల్ మ‌ధ్య స్నేహ‌పూరిత వాతావ‌ర‌ణం ఉంది. రెండుమూడుసార్లు ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు క‌లుసుకోవ‌డం.. ఉమ్మ‌డి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం చ‌ర్చించ‌డం.. న‌దీజ‌లాల వినియోగంలో ఉమ్మ‌డిగా ముందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం.. ఇలా త‌దిత‌ర అంశాల్లో సుహృద్భావ వాతావ‌ర‌ణంలో క‌నిపించారు. అయితే.. ఇదే స‌మ‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ప‌రోక్షంగా ఇరుకున ప‌డేస్తున్నాయి.


నిజానికి.. భారీ షాకులు ఇస్తున్నాయ‌నే చెప్పొచ్చు. ఏపీఎస్ ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేస్తాన‌ని ప్ర‌క‌టిస్తూ జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో తెలంగాణలో ఇప్పుడు పెద్ద ఉద్య‌మ‌మే న‌డుస్తోంది. దీంతో కేసీఆర్ తీవ్ర ఇర‌కాటంలో ప‌డిపోతున్నారు. ఏపీలో ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేస్తూ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. దీంతో అక్క‌డి కార్మికులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో తెలంగాణ‌లో కూడా ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేయాల‌ని టీఎస్ ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5వ తేదీ నుంచి స‌మ్మె చేస్తున్నారు.


అయితే.. విలీనం ఎట్టిప‌రిస్థితుల్లోనూ సాధ్యం కాద‌ని సీఎం కేసీఆర్ తెగేసి చెబుతున్నారు. అయితే.. ఎంతో ఆర్ఠిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీలో విలీనం చేసిన‌ప్పుడు.. ఆర్థికంగా బ‌లంగా ఉన్న తెలంగాణ‌లో ఎందుకు చేయ‌ర‌ని కార్మికుల‌తోపాటు సామాన్య‌ప్ర‌జ‌లు కూడా కేసీఆర్‌ను ప్ర‌శ్నిస్తున్నారు.  తెలంగాణ‌లో కూడా ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేయాల‌ని అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లు ఉద్య‌మిస్తున్నారు. కార్మికుల ఉద్య‌మం రోజురోజుకూ ఉదృతం అవుతోంది. దీంతో కేసీఆర్ సూటిగా స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.


అయితే.. హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ భారీ విజ‌యాన్ని అందుకున్న త‌ర్వాత గురువారం సాయంత్రం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి ఆర్టీసీ కార్మికుల స‌మ్మెపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆర్టీసీని ఎవ‌రూ కాపాడ‌లేర‌ని అన్నారు. ఇక ఏపీలో ఆర్టీసీ విలీనంపై కూడా ఆయ‌న స్పందించారు. ఏపీలో ఏం జ‌రుగుతుందో ఆ దేవుడికి తెలియాల‌ని, రెండు మూడు నెల‌ల్లో విష‌యం అర్థం అవుతుంద‌ని ప‌రోక్షంగా సీఎం జ‌గ‌న్‌ను ఉద్దేశించి వ్యంగాస్త్రాలు విసిరారు.


అయితే.. ఇదే స‌మ‌యంలో ఏపీ సీఎం జ‌గ‌న్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌భుత్వంలో ఆర్టీసీ విలీనంపై మ‌రో ముంద‌డుగు వేశారు. దీనికి సంబంధించిన విధివిధానాల‌ను రూపొందించాల‌ని క‌మిటీని ఆదేశిస్తూ ఉత్త‌ర్వ‌లు జారీ చేశారు. దీంతో మ‌రోసారి కేసీఆర్ ఇరుకున ప‌డిపోయారు. ఇదిలా ఉండ‌గా.. న‌దీజ‌లాల వినియోగంలో ఉమ్మ‌డి ప్రాజెక్టు చేప‌ట్టాల‌న్న నిర్ణ‌యం నుంచి జ‌గ‌న్ త‌ప్పుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: