దుష్యంత్‌ చౌతాలా...ప్ర‌స్తుతం కింగ్ మేక‌ర్‌. హ‌ర్యానా ఎన్నిక‌ల్లో స‌త్తా చాటిన నేత‌. మాజీ ఉప ప్రధాని దేవీలాల్‌ మునిమనుమడు దుష్యంత్‌చౌతాలా సారథ్యంలోని జన్‌నాయక్‌ జనతాపార్టీ (జేజేపీ) అనూహ్యంగా 10 స్థానాలను కైవసం చేసుకుంది. హంగ్‌ అసెంబ్లీ ఏర్పడడంతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ప్రభుత్వ ఏర్పాటులో జేజేపీ, స్వతంత్రులు కీలకం కానున్నారు. అయితే, ఈ స‌మ‌యంలోనే...దుష్యంత్ చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న వేస్తున్న అడుగులు చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. 


హర్యానా ఓటర్లు ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీని ఇవ్వలేదు. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు 46 స్థానాలు అవసరం. 75 స్థానాల్లో గెలుపొందాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ కేవలం 40 సీట్లలోనే విజయం సాధించింది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ అధికారానికి ఆరు సీట్ల దూరంలో నిలిచిపోయింది. దుష్యంత్‌చౌతాలా సారథ్యంలోని జన్‌నాయక్‌ జనతాపార్టీ అనూహ్యంగా 10 స్థానాలను కైవసం చేసుకుంది. ఎన్నికల ఫలితాల సందర్భంగా జేజేపీ నేత దుష్యంత్‌ చౌతాలా మాట్లాడుతూ.. బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఫలితాలు స్పష్టంచేస్తున్నాయని పేర్కొన్నారు. అయితే ఆయన ఎవరికి మద్దతు ఇస్తారనేదానిపై మాత్రం స్పష్టతనివ్వలేదు. కాగా, జాట్ల ప్రాబల్యమున్న దేశ్‌వాళీ బెల్ట్‌లో (రోహ్‌తక్‌, ఝజ్జర్‌, సోనిపట్‌ జిల్లాలు) కాంగ్రెస్‌ హవా కొనసాగించింది. ఇక్కడ 11 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ ఒక్క సీటును మాత్రమే సాధించింది. తాజా ఫలితాల నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఆదేశాల మేరకు సీఎం ఖట్టర్‌ ఢిల్లీకి వెళ్లి ఆయనను కలిశారు.

 


మ‌రోవైపు స‌ర్కారు ఏర్పాటుకు బీజేపీ, కాంగ్రెస్‌ వేగంగా పావులు కదుపుతున్నాయి. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీ అధినాయకత్వంతో సమావేశమయ్యేందుకు ఢిల్లీకి పయనమైనట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కాషాయపార్టీకి మద్దతు ప్రకటించినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. గెలుపొందిన ఏడుగురు స్వతంత్రుల్లో ఐదుగురు బీజేపీ రెబల్సే కావడం గమనార్హం. వీరిని తిరిగి పార్టీ గూటికి రప్పించగలిగితే.. దుష్యంత్‌ మద్దతుతో పనిలేకుండా ఆ పార్టీ సులభంగా ప్రభుత్వం ఏర్పాటుచేసే వీలుంది.  కాగా, జేజేపీ అధినేత దుష్యంత్‌.. ఉచానా కలాన్‌ సిట్టింగ్‌ బీజేపీ ఎమ్మెల్యే ప్రేమ్‌లతపై విజయం సాధించారు. ప్రేమ్‌లత మాజీ కేంద్రమంత్రి బీరేందర్‌సింగ్‌ భార్య. 


మరింత సమాచారం తెలుసుకోండి: