ఎప్పుడు ఎన్నికల్లో ఓటమి ఎదురైనా కాంగ్రెస్ లో కుమ్ములాటలే ప్రధాన కారణమవుతోంది. తాజాగా ఓడిపోయిన హుజూర్ నగర్ ఉపఎన్నికలో కూడా కాంగ్రెస్ ఓటమికి కుమ్ములాటనే ప్రధాన కారణమని విశ్లేషణలు జోరందుకున్నాయి. నిజానికి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదనే చెప్పాలి. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీకి హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం కంచుకోటలాంటిది.

 

అదే సమయంలో టిఆర్ఎస్ ఏర్పాటైన దగ్గర నుండి ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ గెలిచిందే లేదు.  ఇపుడు కూడా ఇది కాంగ్రెస్ సిట్టింగ్ సీటే అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఎంఎల్ఏగా గెలిచిన పిసిపి అధ్యక్షుడు  ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపిగా గెలవటంతో ఇక్కడ రాజీనామా చేశారు. దాంతో ఉపఎన్నిక అనివార్తమైంది.

 

ఎటూ తాను రాజీనామా చేసిన సీటే కాబట్టి తన భార్య పద్మావతినే పోటి చేయించాలని ఉత్తమ్  అనుకున్నారు. ఇక్కడే సమస్య మొదలైంది. తన భార్య పోటి చేస్తుందని ఉత్తమ్ సీనియర్ నేతలెవరినీ సంప్రదించకుండానే ప్రకటించేశారు. ఉత్తమ్ ప్రకటనతో సీనియర్లందరికీ ఒళ్ళుమండిపోయింది. సరే తర్వాత అధిష్టానం కూడా పద్మావతినే ఎంపిక చేసినప్పటికీ అప్పటికే సీనియర్లందరూ ఉత్తమ్ కు వ్యతిరేకమైపోయారు.

 

ఉత్తమ్ పిసిసి అధ్యక్షునిగా ఉండటం ఇష్టం లేని చాలామంది సీనియర్లు ఏకమయ్యారు. అదే సమయంలో ఉత్తమ్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి మొదటి నుండి పడటం లేదు. అయితే ఉపఎన్నికలో అందరూ అభ్యర్ధి గెలుపు కోసం పనిచేస్తున్నట్లు షో చేశారే కానీ చిత్తశుద్దితో విజయానికి ఎవరూ కష్టపడలేదని సమాచారం.

 

అదే సమయంలో పైకి కాంగ్రెస్ విజయం కోసం తిరుగుతునే లోలోపల ప్రత్యర్ధి విజయానికి లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కూడా పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇపుడు గనుక పద్మావతి గెలిస్తే పిసిసి అధ్యక్షుని ఉత్తమ్ మరింతగా పాతుకుపోతారని చాలామంది నేతలు గుర్రుగా ఉంటున్నారట. అంటే కుమ్ములాటలే పద్మావతి ఓటమికి కారణమని అర్ధమైపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: