ఏపీలో ఇసుక కొరతకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని టీడీపీ ఆరోపించింది. ఆన్ లైన్ అక్రమాలు అరికట్టాలని ఆ పార్టీ నేతలు  డిమాండ్ చేశారు. ఇసుక కొరతపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిరసనలు చేపట్టింది. పలు జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించింది. తక్షణమే ఇసుక  రీచులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు నేతలు. 


ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరతపై అన్ని జిల్లాల్లో టీడీపీ ఆందోళనలు నిర్వహించింది. గుంటూరు జిల్లా తెనాలిలో ఆ పార్టీ నేతలు  నిరసనలు చేపట్టారు. భవన నిర్మాణ కార్మికులతో కలిసి ప్రదర్శన జరిపారు. తక్షణమే ఇసుక రీచ్‌లను ప్రజలకు అందుబాటులోకి  తీసుకురావాలని డిమాండ్ చేశారు. అటు...గురజాలలో ఇసుక ఆందోళనలో పాల్గొనేందుకు వెళ్తున్న యరపతినేని శ్రీనివాసరావును  సత్తెనపల్లిలో పోలీసులు అరెస్టు చేశారు.


రాష్ట్రంలో ఇసుక కొరతకు నిరసనగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. సబ్ కలెక్టర్  కార్యాలయం, చిత్తూరు బస్టాండ్ దగ్గర నిరసన ప్రదర్శనలు జరిపారు. మరోవైపు...ప్రకాశం జిల్లాలో టీడీపీ ఆందోళనలు నిర్వహించింది. ఇసుక లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి  కోల్పోయారని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులతో కలిసి  టీడీపీ నేతలు గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.


కడప జిల్లా రాజంపేటలోని గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ నేతలు ఆందోళన చేశారు. ఇసుక విధానంపై రాష్ట్ర ప్రభుత్వం  వ్యవహరిస్తున్న తీరుకి నిరసనగా నల్ల రిబ్బన్లు ధరించి నిరసన దీక్ష చేపట్టారు. అటు...పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి. పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్ నుంచి  నర్సాపురం సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇసుక కొరత...ఆన్లైన్ అక్రమాలను అరికట్టాలని డిమాండ్  చేశారు టీడీపీ నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: