గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తమతోనే సాధ్యం అంటున్నారు బీజేపీ నేతలు. బాపూజీ 150వ జయంతి సందర్భంగా ఏపీలో సంకల్ప యాత్రలు నిర్వహించారు.  ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏ కాలానికైనా గాంధీ సిద్ధాంతాలు ఆచరణీయమని అన్నారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. గాంధీ సంకల్పయాత్ర  విజయవంతంగా సాగుతోందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజధానిపై స్పందించాలని డిమాండ్ చేశారు. రాజధానిపై ప్రజల్లో గందరగోళం ఉన్నమాట నిజమేనని అన్నారు. జాతీయ పార్టీగా ఇప్పుడే దీనిపై స్పందించలేమని తెలిపారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి.  


గాంధీజీ 150వ జయంతిని పురస్కరించుకుని బీజేపీ సంకల్ప యాత్రను పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో  ప్రారంభించారు. బీజేపీ నేతలు జాతీయ జెండాలను, కాషాయ జెండాల పట్టుకుని సుమారు 10కిలో మీటర్ల మేర పాదయాత్ర చేశారు. గ్రామస్వరాజ్యం వైపు బీజేపీ అడుగులు వేస్తోందని అన్నారు ఆ పార్టీ నేతలు. అటు... ప్రకాశం జిల్లా ఒంగోలులో బీజేపీ నేతలు గాంధీ సంకల్ప యాత్ర నిర్వహించారు. దేశంలో ప్రాంతీయ పార్టీలకు కాలం  చెల్లిపోయిందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు కమలం నేతలు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా...గెలవటమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తుందని  తెలిపారు.


మరోవైపు... నెల్లూరు జిల్లా ముత్తుకూరులో గాంధీ సంకల్ప యాత్ర నిర్వహించారు బీజేపీ నేతలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బాపూజీ ఆశయాలను నరేంద్ర మోదీ  నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా. మొత్తానికి...గాంధీజీ 150వ జయంతి సందర్భంగా బీజేపీ చేపట్టిన సంకల్ప యాత్ర జనంలో ఆ పార్టీకి పాజిటివ్ వేవ్ ను  తీసుకొస్తుందా? లేదా? అనేదే ప్రస్తుతం ఆసక్తిగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: