తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఆర్టీసీ మూసివేతే తుది పరిష్కారమని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేసారు.నష్టాల బాటలో ఉన్న సంస్థను పునరుద్ధరించడం అసాధ్యమని చెప్తున్నారు కేసీఆర్‌.. సమ్మె విష యంలో యూనియన్లు, రాజకీయ పార్టీల తీరును తీవ్ర స్థాయిలో తప్పు బట్టారు.టీఆర్‌ఎస్‌ కార్యా లయం తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో కలపడం అర్థ రహిత, అసంబద్ధ, తెలివితక్కువ నిర్ణయం. పనికి మాలిన, తల మాసిన రాజకీయ పార్టీలు దీనిపై మాట్లాడటం కెసిఆర్ కి విడ్డూరం గా అనిపిస్తుంది అని చెప్పారు.పది మంది కనపడితే చాలు.. జెండా పట్టుకొని కూర్చుంటున్నారు.తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన సకల జనుల సమ్మెలో  ఒక్క ఆర్టీసీ కార్మికులే సమ్మెలో పాల్గొన్నారా? వారి ఒక్కళ్ల వల్లే తెలంగాణ వచ్చిందా?’’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు. 

గొంతెమ్మ కోరికలు పెట్టి నాలుగు ఓట్లు రాబట్టుకొనే చిల్లర యూనియన్‌ రాజకీయాలు అంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల తీరుపై సీఎం కేసీఆర్‌  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సంస్థ మనుగడ, కార్మికుల జీవితాలతో ఆడుకోవద్దనే జ్ఞానం ఉన్నవారు ఎవరూ సమ్మె చేయరు. ఆర్టీసీ యూనియన్లు అమాయక కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారు అంటూ మంది పడ్డారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లతో నాకేమీ పంచాయితీ లేదు. సమ్మె చట్ట విరుద్ధం.

యూనియన్లు చేస్తున్న సమ్మెతో ఆర్టీసీకి భవిష్యత్తు ఉండదు ఇక అని సీఎం హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులు వారి కాళ్లను వారే నరుక్కుంటున్నారు. ఆర్టీసీ మనుగడ ఇకమీదట  కష్టం.ఆర్టీసీపై తనకు ఉన్నంత అవగాహన, అభిమానం మరెవరికి లేదు అని, గతంలో ఉమ్మడి ఏపీలో రవాణా మంత్రిగా రూ. 13.80 కోట్ల నష్టాల్లో ఉన్న ఆర్టీసీలో సంస్కరణలు తెచ్చి ఏడాదిన్నరలో నష్టాన్ని పూడ్చటంతోపాటు రూ. 14 కోట్ల లాభాల్లోకి తెచ్చా అని,ఆర్టీసీని కాపాడేందుకు ఎంతో ప్రయత్నించాం అంటూ చెప్పుకొచ్చారు కెసిఆర్.


మరింత సమాచారం తెలుసుకోండి: